అతివేగంతో అదుపుతప్పిన కారు (Car) ఓ హోటల్ (Hotel)లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు దుర్మరణం చెందారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు (Potti Sriramulu Nellore) జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం (Pothireddypalem)లో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతో పాటు హోటల్ యజమాని రమణయ్య(Ramannaiah) అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు నారాయణ మెడికల్ కాలేజీ (Narayana Medical College) లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. మృతులు నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు గుర్తించారు. నవనీత్ రెడ్డి అనే మరో విద్యార్థికి నారాయణ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం (Buchireddypalem)లో ఓ నిశ్చితార్థానికి (Engagement) హాజరై తిరిగి వస్తున్న క్రమంలో కారు అదుపుతప్పి వేగంగా హోటల్లోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.








