రాష్ట్రంలో చట్టం అధికార పార్టీకి చుట్టంగా మారిందని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాడి చేసిన వారికి రక్షణ కల్పిస్తూ.. దాడికి గురైన వారిపైనే కేసులు పెట్టి బాధితులను నిందితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను పక్కనపెట్టి చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’(Red Book Constitution) అమలు చేస్తోందని ఆరోపించారు. కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షిని (B. Virupakshi) ములాఖత్‌లో కలిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పగటిపూట నోటీసు ఇస్తే విరూపాక్షి పోలీసుల ఎదుట హాజరయ్యేవారు కాదా? ఆయనేమైనా పారిపోయే వ్యక్తా? ఉగ్రవాదా? అని ప్రశ్నించారు.
దాడి చేసిన వారికి రక్షణ.. బాధితులపైనే కేసులు!
విరూపాక్షి వ్యవహారంలో పోలీసులు అడుగడుగునా చట్టాన్ని ఉల్లంఘించారని జగన్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, దాడికి గురైన వారిపైనే తిరిగి కేసులు నమోదు చేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. గాయపడిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. ఫిర్యాదు లేకుండానే కేసులు నమోదు చేయడం, ఎమ్మెల్యే ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడటం, సీసీ కెమెరాలను తీసుకెళ్లడం, విరూపాక్షితోపాటు ఆయన కుటుంబ సభ్యులను (Family Members) కూడా కేసుల్లో ఇరికించడం చూస్తుంటే ఇదంతా పక్కా రాజకీయ కుట్రేనని జగన్ ఆరోపించారు. పోలీసులు(Police) చట్టానికి జవాబుదారులా? లేక చంద్రబాబు రెడ్‌బుక్‌కు కాపలాదారులా? అని నిలదీశారు.
ఎదిగే బీసీ నేతలపై కేసుల కత్తి
రాష్ట్రంలో రాజకీయంగా ఎదుగుతున్న బీసీ (BC), మైనార్టీ (Minority) నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమ కేసులు (Illegal Cases) పెడుతోందని జగన్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు(Dr. Seediri Appalaraju), ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి(Virupakshi), గుంటూరు మైనార్టీ నాయకుడు ముస్తఫా, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ (Karumuri Sunil) తదితరులపై కేసులు నమోదు చేసిన తీరు ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజల్లో ఆదరణ పెంచుకుంటున్న నాయకులను రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసు కేసులతో అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా బీసీలు, మైనార్టీల నుంచి నాయకత్వం ఎదగకుండా కేసులు, అరెస్టులు, వేధింపులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయ కక్షసాధింపు మాత్రమే కాకుండా సామాజిక న్యాయంపై జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు.
జైలులోనూ జగన్‌ను అవమానించే ప్రయత్నం!
విరూపాక్షిని కలిసేందుకు జైలుకు వెళ్లిన తన విషయంలోనూ అధికారులు ఉద్దేశపూర్వకంగా అవమానకరంగా వ్యవహరించారని జగన్ ఆరోపించారు. సాధారణంగా ములాఖత్‌కు (Mulakat) వచ్చిన వారిని కూర్చోబెట్టి ఫొటోలు, వీడియోలు తీస్తారని.. తనను మాత్రం గ్రిల్ వద్ద నిలబెట్టి చిత్రీకరించారని చెప్పారు. ఈ వివక్షపై జైలు సూపరింటెండెంట్‌ను ప్రశ్నిస్తే ‘పై నుంచి వచ్చిన ఆదేశాలు’ అని సమాధానం చెప్పారని జగన్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి విషయంలోనూ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో పాలన ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతోందని విమర్శించారు.
అధికారం శాశ్వతం కాదు.. గుర్తుపెట్టుకోండి!
అధికారం శాశ్వతమనే భ్రమలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగన్ హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్షతో తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, పెట్టిస్తున్న ప్రతి అక్రమ కేసు, చేయిస్తున్న ప్రతి అరెస్టు భవిష్యత్తులో రాజకీయంగా తిరిగి ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయలేరని తేల్చిచెప్పారు. పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడబోదని.. బాధితుల పక్షాన మరింత గట్టిగా పోరాడుతుందని జగన్ స్పష్టం చేశారు.







