విశాఖ ఉక్కుపై ఇటీవల జరిగిన సీఐఐ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రచ్చ లేపుతున్నాయి. స్టీల్ ప్టాంట్‌ను వైట్ ఎలిఫెంట్‌తో పోల్చడం, కార్మికులు ఊర్కనే జీతాలు తీసుకుంటున్నారన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతుండగా, ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో అంతరంగం మరేదో ఉందన్న అపోహలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఓ లేఖ రాయడం సంచలనంగా మారింది. రూ. 4 లక్షల కోట్ల విలువ గల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ‘తెల్ల ఏనుగు’ అని చెప్పడం ఎంతవరకు న్యాయమో ప్రజలకు అర్థం కావడం లేదని ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 మంది అమరుల ప్రాణత్యాగాలతో సాధించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, గౌరవం, భావోద్వేగాలకు ప్రతీక అని గుర్తుచేశారు.
ఈశ్వరయ్య తన లేఖలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం “పబ్లిక్ వెల్త్‌ను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలన్న దురుద్దేశంతో” విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ వైపు నెట్టేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం వంతపాడటం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. మిట్టల్ కంపెనీకి మైన్స్ కేటాయించాలంటూ ఎంపీలు సిఫార్సులు చేస్తూ ఉంటే, అదే ఎంపీలు విశాఖ ఉక్కుకు మైన్స్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రప్పించాలి అని ఈశ్వరయ్య కోరారు. అంతేకాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే దానికి కావాల్సిన క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం సహకరిస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆయన హెచ్చరించారు.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్