విజ‌య‌వాడ మేయ‌ర్ సీటు.. ‘బోండా వర్సెస్ రాధా’!

విజ‌య‌వాడ మేయ‌ర్ సీటు.. 'బోండా వర్సెస్ రాధా'!

Summarize with AI

విజయవాడ మేయర్ పదవి చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాపుల ఆరాధ్యుడు వంగవీటి మోహన రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి, చేజేతులా రాజకీయ ప్రాభవాన్ని తగ్గించుకుంటున్న వంగవీటి రాధాకృష్ణను తెలుగుదేశం పార్టీ మరోసారి తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజ‌య‌వాడ మేయ‌ర్ సీటు కోసం జనసేన నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడానికి, సొంత పార్టీలోని వర్గపోరును చల్లార్చడానికి టీడీపీ త‌న మార్క్ రాజ‌కీయ వ్యూహాన్ని అమ‌లు చేస్తోంద‌ని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజికవర్గం ఆరాధ్యదైవంగా పూజించే వంగవీటి మోహన రంగా కుమారుడు రాధాకృష్ణ, తన తండ్రి ఆశయాలను, పేరు ప్రఖ్యాతులను నిలబెడ‌తార‌ని ప్ర‌జ‌లంతా భావించారు. కానీ జ‌నం పెట్టుకున్న అంచ‌నాల‌ను రాధా చేరుకోలేక‌పోయారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆయనకు ఇప్పటివరకు చివరి అసెంబ్లీ విజయం. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసినా గెల‌వ‌లేదు. ఆ త‌రువాత టీడీపీలో చేరిన 2019, 2024లో వంగ‌వీటి రాధాకు టికెట్ కూడా ద‌క్క‌లేదు.

2019 ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి వస్తుందనగా, తొందరపాటు నిర్ణయంతో పార్టీని వీడి తన రాజకీయ భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకున్నారు. వంగవీటి రంగా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీలోనే రాధా చేరడం ఆయన తండ్రి అభిమానులకు, కాపు సామాజిక వర్గానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయన రాజ‌కీయాల్లో ఉన్నారో.. లేరో.. కూడా తెలియని పరిస్థితి. స్థితప్రజ్ఞత, రాజకీయ పరిణితి లేకపోవడమే ఆయన రాజకీయ పతనానికి కారణమైందని, ఇన్నాళ్లూ ఎలాంటి పదవీ ఇవ్వకుండానే వాడుకుని వదిలేసిన టీడీపీ, ఇప్పుడు మేయర్ పదవి పేరుతో కొత్త వ్యూహానికి తెరతీసిందనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

జనసేనకు చెక్ పెట్టేందుకు ‘రాధా’ కార్డు!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ స్థానాన్ని తమకే కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేతలు పదే పదే పట్టుబడుతున్నారు. అయితే మేయర్ పీఠాన్ని జనసేనకు వదులుకోవడానికి సిద్ధంగా లేని చంద్రబాబు నాయుడు వంగవీటి రాధా పేరును తెరపైకి తెచ్చారు.

పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికే చెందిన వంగవీటి రాధాను పవన్‌కు దగ్గర చేస్తూ, ఆయనకు మేయర్ సీటు కట్టబెడితే జనసేన నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండదని చంద్రబాబు భావిస్తున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది. తద్వారా జనసేన నోరు మూయించడంతో పాటు, విజయవాడ మేయర్ పీఠం టీడీపీ చేతిలోనే ఉండేలా వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా పనిచేసిన రాధాకృష్ణ, ఒక మేయర్ పదవి కోసం ఆశపడటం తన రాజకీయ స్థాయిని మరింత దిగజార్చుకోవడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మేయర్ సీటు కోసం బోండా వర్సెస్ రాధా
మరోవైపు విజయవాడ మేయర్ సీటుపై టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే బోండా ఉమా కన్ను పడింది. తన కుమారుడికి ఈ పదవి దక్కించుకోవడం కోసం బోండా శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొడుకు సీటు కోసం చంద్రబాబు దృష్టిని ఆకర్షించేందుకు బోండా ఉమా నిత్యం వైసీపీ నేతలపై బూతులతో విరుచుకుపడుతూ, భౌతిక దాడులకు తెగబడుతూ రచ్చ చేస్తున్నారనే ఆరోప‌ణ‌లున్నాయి. మేయర్ సీటు తన తనయుడికే ఇవ్వాలని చంద్రబాబు దగ్గర బోండా వినతులు కూడా పెట్టుకున్నారు.

దీంతో విజయవాడ మేయర్ పదవి ఇప్పుడు ‘బోండా వర్సెస్ రాధా’ యుద్ధంగా మారింది.

కేవలం వాడుకుని వదిలేసే కుట్ర!
ఇటు జనసేన నుంచి పోటీ లేకుండా చేయడానికీ, అటు బోండా ఉమా వర్గానికి చెక్ పెట్టడానికీ చంద్రబాబు ప్లే చేస్తున్న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీలో వంగవీటి రాధా మరోసారి బలికాక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించే స్థాయి ఉన్న స్వ‌ర్గీయ‌ వంగ‌వీటి రంగా కుమారుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాధాపై.. తండ్రి పేరును, కాపుల ఆత్మగౌరవాన్ని కాపాడే బృహ‌త్త‌ర‌మైన బాధ్య‌త ఉంది. రెండు ప‌ర్యాయాలు ఎమ్మెల్యేగా టికెట్ కూడా ఇవ్వ‌ని టీడీపీ, తాజాగా జ‌న‌సేన‌కు చెక్ పెట్టేందుకు మేయర్ ప‌ద‌వి కోసం రంగంలోకి దింపుతోంద‌ని, ఆ ప‌ద‌విని ఆశిస్తే.. రంగా త‌న‌యుడిగా ఉన్న‌ కొద్దోగొప్పో ఆద‌ర‌ణ కూడా క‌నుమ‌రుగ‌వుతుంద‌నే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment