కోట్లాది మంది భక్తులు తమ ఇష్టదైవానికి భక్తితో సమర్పించుకునే కానుకలకు రక్షణ లేకుండా పోయిందన్న వార్త తిరుమలేశుని భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. కలియుగ వైకుంఠం తిరుమలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ‘పరకామణి’ (హుండీ కానుకల లెక్కింపు కేంద్రం) లోనే దొంగలు పడ్డారు. అదీ ఒక రోజు, రెండు రోజులు కాదు.. నెలల తరబడి స్వామివారి సొమ్ము పక్కదారి పట్టినా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
2024 జూన్‌లో ప్రభుత్వం మారిన తర్వాత, పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరిన వీ.పెంచలయ్య అనే వ్యక్తి ఈ దోపిడీకి తెరలేపాడని సమాచారం. సెప్టెంబర్ నెల నుంచే ఇతను క్రమంగా స్వామివారి బంగారం, వెండి కానుకలను మాయం చేయడం మొదలుపెట్టాడు. జనవరి 11, 2025న ఒక బంగారు బిస్కెట్‌ను ట్రాలీకి చేసిన రంధ్రం ద్వారా దొంగిలిస్తూ విజిలెన్స్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

పెంచలయ్య దొంగతనం చేసిన తీరు చూస్తుంటే ఇది ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దొంగిలించిన బంగారు బిస్కెట్లు, ఆభరణాలను తిరుపతిలోని ఓ ప్రముఖ కార్పొరేట్ నగల దుకాణాలకు తీసుకెళ్లి, వాటికి బదులుగా కొత్త నగలను తీసుకునేవాడని తెలుస్తోంది. తిరుమల వెంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు కూడా పొందాడన్న విషయం సంచలనంగా మారింది. ఒక సామాన్య ఉద్యోగికి ఇంతటి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? బ్యాంకు అధికారులు గానీ, నగల వ్యాపారులు గానీ ఆ నగలు ఎక్కడివని ఎందుకు ప్రశ్నించలేదు? అనేవి ఇప్పుడు మిస్టరీగా మారాయి.
విచారణలో ‘మమ’ అనిపించారా?
దాదాపు కోటి రూపాయల విలువైన బంగారం, వెండి మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నా, పోలీసులు మాత్రం కేవలం 555 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి మాత్రమే రికవరీ చేసినట్లు చూపడం గమనార్హం. నిందితుడికి త్వరగా బెయిల్ రావడంలో టీటీడీ ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. గతంలో కేవలం రూ. 76 వేల దొంగతనం జరిగితేనే నిందితుడి నుంచి రూ. 15 కోట్ల ఆస్తులను రికవరీ చేసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కోటి రూపాయల దోపిడీ జరిగితే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

‘గోల్డ్ బాబు’ ఎవరు?
పరకామణిలో సీసీ కెమెరాలు, పటిష్టమైన విజిలెన్స్ ఉన్నా ఐదు నెలల పాటు దొంగతనాలు సాగడమంటే.. తెర వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పెంచలయ్యను ఆ ఉద్యోగంలో చేర్పించిన ‘అదృశ్య శక్తి’ ఎవరు? ఈ దోపిడీ సొమ్ములో వాటాలు ఎవరికి అందాయి? ఆ ‘గోల్డ్ బాబు’ ఎవరు అనేది బయటపడాల్సి ఉంది.

భక్తులు ఆపద మొక్కులవాడికి సమర్పించే ప్రతి పైసా పవిత్రమైనది. అటువంటి పరకామణిలోనే దొంగతనాలు జరగడం, దర్యాప్తు నామమాత్రంగా సాగడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, సూత్రధారులను కఠినంగా శిక్షించినప్పుడే శ్రీవారి ఆస్తులకు రక్షణ ఉంటుందన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.








