తెలంగాణ ఆర్టీసీ (TSRTC) బస్సులో కనిపించిన ఓ సూచన బోర్డు (Notice Board) ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. బస్సులో(Bus) ప్రయాణిస్తున్న ఓ మహిళ సీట్ల పైన ఉన్న బోర్డును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ బోర్డుపై ‘పురుషులను (Men) గౌరవించటం (Respect) మన సంప్రదాయం(Tradition). వారికి కేటాయించిన (Allocated) సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అని రాసి ఉండటంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
సాధారణంగా మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లు, వారి భద్రతకు సంబంధించిన సూచనలు కనిపిస్తుంటాయి. కానీ పురుషులకు కేటాయించిన సీట్లను గౌరవించాలని ప్రత్యేకంగా సందేశం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ చర్చకు దారితీసింది.
ఈ బోర్డుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం (Mahalakshmi Free Bus Travel Scheme) అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకడం కష్టంగా మారిందని, ఇలాంటి సూచన బోర్డులు అవసరమేనని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ప్రయాణంలో స్త్రీ, పురుషులనే తేడా లేకుండా వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులు, చిన్న పిల్లలతో ఉన్నవారికి సీటు ఇవ్వడమే నిజమైన సంస్కృతి అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఆర్టీసీ బస్సులో కనిపించిన ఈ ఒక్క సందేశం సీట్ల కేటాయింపు, పరస్పర గౌరవం, ప్రయాణికుల బాధ్యతలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపింది.







