పవన్ కల్యాణ్.. బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ

పవన్ కల్యాణ్.. బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ

Summarize with AI

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలు, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టార్గెట్‌గా టీపీసీసీ (TPCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, ఆయన కేవలం “బీజేపీ(BJP) ఆడిస్తున్న తోలుబొమ్మ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో (Gandhi Bhavan) మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు తెలంగాణ గడ్డపై సాగవని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా తెలంగాణను, ఇక్కడి పరిస్థితులను కించపరుస్తున్నారని మహేష్ గౌడ్ మండిపడ్డారు. “తెలంగాణ (Telangana) మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి, ఇక్కడి యువత బలిదానాలు చేసుకుంటున్నప్పుడు ఈ సినిమా నటుడు పవన్ కల్యాణ్ ఏ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారో సమాధానం చెప్పాలి. తెలంగాణ ఎలా వచ్చిందో, ఇక్కడి ప్రజల ఆకాంక్ష ఏంటో ఈ నటుడు ముందుగా తెలుసుకోవాలి” అని ఎద్దేవా చేశారు.

తెలంగాణలోకి పవన్ కల్యాణ్ రావడాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. “ఒక సినిమా నటుడిగా పవన్ మా ప్రాంతానికి వస్తే, గౌరవంగా మా ఇంటికి పిలిచి భోజనం పెడతాం. అంతే తప్ప ఇక్కడికి వచ్చి పెత్త‌నాలు చేస్తానంటే చూస్తూ ఊరుకోం. పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. ఆంధ్ర మూలాలు ఉండి, తెలంగాణను ఎవరు కించపరిచినా సహించేది లేదు” అని హెచ్చరించారు.

దేశ స్వాతంత్ర్యం, అభ్యున్నతి కోసం పోరాడిన వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయి, అర్హత పవన్ కల్యాణ్‌కు లేవని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. “రాజకీయాల్లో పవన్ చాలా చిన్నవాడు. ఆయన ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. ఎవరో వెనుక ఉండి నడిపిస్తుంటే, వారి స్క్రిప్ట్ చదవడం కాదు.. సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలి” అని హితవు పలికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment