వేసవి సెలవులకు సరదాగా పిన్ని ఇంటికి వచ్చిన బాలికకు నరకం చూపించాడు ఓ కామాంధుడు. వరసకు కూతురైన ఒక మైనర్ బాలికపై సొంత బాబాయ్ అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు బాధిత తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కేసు నమోదు చేయడంతో ఈ దుర్ఘటన బయటకు వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో నివసిస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో, తమ మైనర్ కుమార్తెను తిరుపతిలోని లక్ష్మీపురంలో ఉంటున్న పిన్ని ఇంటికి పంపించారు. అయితే, అక్కడే ఉంటున్న ఆమె బాబాయ్ (పిన్ని భర్త) బాలికపై కన్నేశాడు. బాలికకు తెలియకుండా ఆమె నగ్న చిత్రాలను చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పెడతానని భయపెట్టాడు. ఆ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
సెలవులు ముగుస్తుండడంతో బాలిక తిరిగి హైదరాబాద్ చేరుకుంది. అయితే అప్పటి నుండి బాలిక ప్రవర్తనలో మార్పు రావడం, నిరంతరం భయపడుతూ ఉండటాన్ని గమనించిన తల్లి ఆమెను సున్నితంగా నిలదీసింది. దీంతో తనపై జరిగిన దారుణాన్ని బాలిక తల్లికి వివరించి భోరుమంది.
జగద్గిరిగుట్ట టు తిరుపతి..
విషయం తెలుసుకున్న తల్లి వెంటనే హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన ప్రాంతం తిరుపతి పరిధిలోకి రావడంతో, జగద్గిరిగుట్ట పోలీసులు ప్రాథమికంగా జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) నమోదు చేసి కేసును తిరుపతికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ స్వీకరించింది. సీఐ శ్రీనివాసులు నేతృత్వంలో నిందితుడిపై క్రైమ్ నెంబర్ 236/2026 కింద పోక్సో (POCSO) చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.








