ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టులో (High Court) సోమవారం ముగ్గురు కొత్త అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయమూర్తులుగా నియమితులైన సునీత గంధం(Sunita Gandham), ఆలపాటి గిరిధర్(Alapati Giridhar), పురుషోత్తమ్ కుమార్ చింతలపూడితో (Purushottam Kumar Chintalapudi) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ (Lisa Gill) ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇటీవల రాష్ట్రపతి (President) ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఈ ముగ్గురి నియామకాలకు ఆమోదం తెలపడంతో, కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం వారు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ నియామకాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు పెరిగింది. దీంతో పెండింగ్ కేసుల విచారణ వేగవంతం కావడంతో పాటు న్యాయ వ్యవస్థ పనితీరు మరింత సమర్థవంతంగా సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు (Judicial Officers), రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు తదితరులు హాజరై నూతన న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.








