ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన(Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కర్నూలుకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి (Sugali Preethi) తల్లి సుగాలి పార్వతీ దేవి (Sugali Parvathi Devi) స్వయంగా పోలీసులను ఆశ్రయించి ఈ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మరణాన్ని పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుని, తమను ఘోరంగా మోసం చేశారని ఆమె ఆరోపించారు.
పవన్ కళ్యాణ్‌పై చీటింగ్ (మోసం)(Cheating), నమ్మకద్రోహం(Breach of Trust), బహిరంగ విమర్శలు, ఆదివాసీ బిడ్డ మరణంపై అసత్య ఆరోపణలు చేయడం, నిందితులతో కుమ్మక్కవ్వడం వంటి అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్వతీ దేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు అనంతరం సుగాలి పార్వతీ దేవి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఎదుగుదల (Political Growth) కోసం నా బిడ్డ మరణాన్ని వాడుకున్నారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా.. నా బిడ్డ మరణంపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడమని పవన్ కళ్యాణ్ చెబుతుంటారు. అందుకే ఇప్పుడు నేను ఆయన మాట్లాడిన వీడియోల ఆధారంగానే ఆయన్ను ప్రశ్నిస్తున్నాను” అని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ తుంగలో తొక్కారని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. “సుగాలి ప్రీతిని మానభంగం (Sexual Assault) చేసి దారుణంగా చంపేశారని గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణ పైనే చేస్తానని మాకు నమ్మకం కలిగించారు. కానీ అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పూర్తిగా మాట మార్చేశారు” అని ఆరోపించారు.
“ఇప్పుడు డీఎన్ఏ (DNA) ఆధారాలు లేవు, నిందితులు లేరు, అసలు అక్కడ రేప్ జరగలేదు… సాక్ష్యాలు లేకపోతే నేనేం చేయాలి? అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి ఆధారాలు లేవంటూ నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను నాకు న్యాయం చేయమని అడిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడి, జనసేన కార్యకర్తలను నాపైకి ఉసిగొల్పుతున్నారు. ఆ వెంటనే జనసేన నేతలు నాపై దాడులకు దిగుతున్నారు” అని పార్వతీ దేవి ఆరోపించారు.
ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంపైనే ఆమె తల్లి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏపీ రాజకీయాల్లో ఈ ఉదంతం మరోసారి తీవ్ర దుమారానికి తెరలేపింది.







