తెలంగాణలో రైతుల (Telangana Farmers) సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో (Paddy Procurement) జరుగుతున్న అవ్యవస్థపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు 45 రోజులుగా 45 డిగ్రీల ఎండల్లో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (A. Revanth Reddy) ఈ పరిస్థితిని వివరించేందుకు తాను లేఖ రాశానని తెలిపారు. “సీఎంకు డబ్బు సంచులపై ఉన్న దృష్టి ధాన్యం సంచులపై (Paddy Bags) కూడా ఉంటుందని అనుకున్నా.. కానీ ఆయన ప్రెస్మీట్ చూస్తే అసలు పరిస్థితి అర్థమైంది” అంటూ విమర్శించారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకక రైతులు (Farmers) ఇబ్బందులు పడుతుంటే, గన్స్ (Guns) మాత్రం సులభంగా దొరుకుతున్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా సక్రమంగా కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపించిన కేటీఆర్, ప్రభుత్వం చెప్పిన ప్రదేశానికే వచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. “కొనుగోళ్లు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం” అని అన్నారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు 45 శాతం కూడా పూర్తి కాలేదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా (Ex-Gratia)ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ–కాంగ్రెస్ (BJP–Congress) కలిసి తెలంగాణలో రాజకీయాలు నడుపుతున్నాయని ఆరోపిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పర్యటన వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.







