తెలంగాణలో హైదరాబాద్ నగర పాలనలో కీలక మార్పులకు ఉద్దేశించిన కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026 (CURE Bill)కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ నగర పాలనకు ప్రస్తుతం అమల్లో ఉన్న GHMC Act–1955 స్థానంలో కొత్త చట్టపరమైన వ్యవస్థకు మార్గం సుగమమైంది. తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 12న CURE బిల్లును ఆమోదించింది. ఈ చట్టం పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధుల్లో సమన్వయంతో పాలన సాగించే విధానం ఏర్పడనుంది.
CURE చట్టం ద్వారా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లోని వివిధ ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కోసం కొత్త పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రణాళిక, రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, సరస్సుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ వంటి అంశాల్లో సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాపర్టీ ట్యాక్స్ విధానంలోనూ మార్పులు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉన్న Annual Rental Value విధానానికి బదులుగా Capital Value Systemను అమలు చేయనున్నారు. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్‌లో వార్షిక పెరుగుదల గరిష్ఠ పరిమితిని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించే నిబంధనను బిల్లులో పొందుపరిచారు. మొత్తంగా హైదరాబాద్ నగరానికి ఒకే సమన్వయంతో కూడిన పాలనా వ్యవస్థను అందించడమే CURE చట్టం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.







