‘హనుమాన్ అంశ్’ చూసి భావోద్వేగానికి గురైన నీమ్ కరోలి బాబా కుమార్తె

‘హనుమాన్ అంశ్’ చూసి భావోద్వేగానికి గురైన నీమ్ కరోలి బాబా కుమార్తె

Summarize with AI

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.329 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత రాగిణి సోనా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా కుమార్తె గిరిజా జీ.. ప్రేమగా ‘అమ్మాజీ’ అని పిలిచే ఆమె ఈ సినిమాను ఏకంగా 15 సార్లు చూశారని తెలిపారు. ముఖ్యంగా ప్రతిసారీ హనుమాన్ ఎపిసోడ్ చూసినప్పుడు ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారని రాగిణి వెల్లడించారు. నీమ్ కరోలి బాబా కుమార్తె కావడంతో గిరిజా జీకి ఆయన భక్తుల్లో ప్రత్యేక గౌరవం ఉంది. సినిమా విడుదలకు ముందే ఆమె ఆశీస్సులు తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించి, దర్శకుడు విశాల్ చతుర్వేదితో కలిసి గిరిజా జీని కలిసినట్లు రాగిణి తెలిపారు. ఆ సమయంలో బాబాపై సినిమా చేయాలనే ఆలోచన తనకు ఎలా వచ్చిందని గిరిజా జీ ప్రశ్నించగా, తాను ఆరేళ్ల వయసులోనే బాబాను కలిసిన విషయంతో పాటు సినిమా కోసం విశాల్ చేసిన పరిశోధన గురించి రాగిణి వివరించారు.

అయితే ఆ భేటీలో జరిగిన ఓ సంఘటన తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని రాగిణి సోనా తెలిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన కుటుంబానికి సంబంధించిన దాదాపు 50 ఏళ్ల నాటి విషయాలు, ఆగ్రాలోని తమ పాత ఇంటి లొకేషన్, తన అన్నయ్య పేరు వంటి వివరాలను గిరిజా జీ చెప్పారని ఆమె వెల్లడించారు. ఆ వివరాలు తనకు ఎలా తెలుసని అడిగినప్పుడు గిరిజా జీ ఇచ్చిన సమాధానం కూడా తనను ఆలోచనలో పడేసిందని రాగిణి పేర్కొన్నారు. ఈ అనుభవాన్ని ‘హనుమాన్ అంశ్’ సినిమా ప్రయాణంలో అత్యంత ప్రత్యేకమైన సంఘటనగా ఆమె గుర్తుచేసుకున్నారు. నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రభావం, ఆయన నడిపిన కైంచి ధామ్ ఆశ్రమం ప్రాముఖ్యతను సినిమాలో చూపించడంతో బాబా భక్తుల నుంచి ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించిందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం గిరిజా జీ ఈ సినిమాను 15 సార్లు చూసి హనుమాన్ ఎపిసోడ్ సమయంలో ప్రతిసారీ భావోద్వేగానికి గురయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment