ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ జనసేనలో సీట్ల సర్దుబాటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ శ్రేణులకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు చేశారు. పోటీ చేసే సీట్ల సంఖ్య కంటే గెలిచే అవకాశాలున్న స్థానాలే ముఖ్యమని స్పష్టం చేశారు. 60, 70 లేదా 120 సీట్లు కావాలని ఒత్తిడి చేయడం సరికాదని క్యాడర్‌కు ముందుగానే సున్నితమైన హెచ్చరిక చేశారు.
జనసేనకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయంతో పార్టీ శ్రేణుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై అంచనాలు పెరిగాయి. దీంతో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కోరుతున్న పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే జనసేన నాయకత్వం మాత్రం 2024 అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాన్ని స్థానిక ఎన్నికలకు నేరుగా వర్తింపజేయబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. పార్టీకి బలమైన సంస్థాగత పునాది ఉన్న ప్రాంతాల్లోనే పోటీ చేస్తామని నాదెండ్ల మనోహర్ గతంలోనూ చెప్పారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి సమయం పడుతుందని నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా భిన్నమైన చర్చ కూడా మొదలైంది. పార్టీ స్థాపించి 12 ఏళ్లు దాటిన తర్వాత కూడా సంస్థాగతంగా ఇంకా బలపడాల్సి ఉందని క్యాడర్‌కు చెబుతున్న నాయకత్వం.. ఇన్నేళ్లలో పార్టీ నిర్మాణం ఏ స్థాయిలో జరిగిందనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయని విమర్శకులు అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని సీట్లు కోరాలనే అంశంపై క్యాడర్ నుంచి వస్తున్న డిమాండ్లకు నాదెండ్ల మనోహర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. 60, 70, 120 స్థానాలు కావాలని ఒత్తిడి చేయకుండా.. పార్టీ గెలిచే బలం ఉన్న స్థానాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
గతంలో స్థానిక ఎన్నికల సీట్ల పంపకాలపై 80:15:5 వంటి ఫార్ములాపై ప్రచారం జరిగింది. నాదెండ్ల తాజా వ్యాఖ్యల నేపథ్యంలో జనసేనలోని కార్యకర్తల పాత్రపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. పార్టీ కోసం పనిచేసే క్యాడర్‌కు పదవులు, రాజకీయ అవకాశాల విషయంలో పరిమితులు విధిస్తూ, ఎన్నికల సమయంలో మాత్రం పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు కీలకంగా మారింది. మూడు పార్టీల మధ్య స్థానిక స్థాయిలో సమన్వయం అవసరమని ఇప్పటికే కూటమి నేతలు చెబుతున్నారు.
జనసేన మాత్రం తమకు బలమున్న ప్రాంతాల్లో గెలిచే అవకాశాలను బట్టి సీట్లు తీసుకోవాలని భావిస్తోంది. దీంతో పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయి? ఏ ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారు? అన్నది తుది సీట్ల సర్దుబాటు తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. దీంతో స్థానిక ఎన్నికల్లో జనసేనకు కేటాయించే సీట్ల సంఖ్య ఎంత? పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు ఏవి? క్యాడర్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి? అన్నదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.








