తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) పరిధిలోని ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో(Sri Venkateswara Institute of Medical Sciences – SVIMS) డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ (Director-cum-Vice Chancellor) నియామకం వివాదాస్పదంగా మారింది. కనీస అర్హతలు, అనుభవం లేని వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)(NMC), స్విమ్స్(SVIMS) నిబంధనలను పక్కన పెట్టి ఈ నియామకం చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్(Dr. R.V. Kumar) మూడేళ్ల పదవీకాలం ముగియడంతో.. బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్‌కు(Dr. Jagadish) స్విమ్స్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ టీటీడీ ఈవో రవిచంద్ర (TTD EO Ravichandra) ఆదేశాలు జారీ చేశారు. అయితే స్విమ్స్ వంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థకు డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు అప్పగించే విషయంలో అనుసరించాల్సిన అర్హతలు, నిబంధనలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
స్విమ్స్ వైస్ ఛాన్సలర్‌గా నియమించాలంటే ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు హెచ్‌ఓడీ, డీన్ లేదా రిజిస్ట్రార్ వంటి కీలక పరిపాలనా బాధ్యతల్లో అనుభవం ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కనీసం పదేళ్లపాటు ప్రొఫెసర్, హెచ్‌ఓడీ(HOD), డీన్(Dean) లేదా రిజిస్ట్రార్(Registrar) స్థాయిలో అనుభవం ఉండాలనే నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం అదనపు బాధ్యతలు అప్పగించిన వ్యక్తి డాక్టర్ జగదీష్ కనీసం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేయలేదని ఆరోపణలు రావడంతో.. స్విమ్స్ నిబంధనల ప్రకారం ఆయనకు ఈ బాధ్యతలు ఎలా అప్పగించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక వయోపరిమితిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌ఎంసీ నిబంధనల (NMC Rules) ప్రకారం 70 ఏళ్లకు పైబడిన వ్యక్తిని అత్యంత కీలకమైన వైస్ ఛాన్సలర్ పదవిలో నియమించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం అదనపు బాధ్యతలు పొందిన డాక్టర్ జగదీష్ వయసు 72 ఏళ్లు కావడంతో ఈ నియామకంపై మరింత చర్చ జరుగుతోంది. ఎన్‌ఎంసీ నిబంధనలు, స్విమ్స్‌కు సంబంధించిన నియామక నిబంధనలకు విరుద్ధంగా 72 ఏళ్ల వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడంపై టీటీడీ తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అదనపు బాధ్యతలు అప్పగించిన వ్యక్తిపై గతంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు విమర్శకులు పేర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు (Corruption Allegations) ఎదుర్కొన్న వ్యక్తికి స్విమ్స్ వంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలను తుంగలో తొక్కి.. నచ్చిన వ్యక్తికి కీలక బాధ్యతలు ఇవ్వడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్విమ్స్‌లో డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ వంటి కీలక పదవికి అర్హతలు, అనుభవం, వయోపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా? ఎన్‌ఎంసీ నిబంధనలను పాటించారా? అనే దానిపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
స్విమ్స్ ప్రతిష్ట, వైద్య విద్య, రోగుల సేవలు, పరిపాలనకు సంబంధించిన కీలక బాధ్యతలు ఉన్న నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.








