‘నేను నిర్దోషిని.. నన్ను టార్చర్ చేస్తున్నారు’

'నేను నిర్దోషిని.. నన్ను టార్చర్ చేస్తున్నారు'

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ నాగరాజు రాసిన ఒక లేఖ ఇప్పుడు పోలీస్ శాఖతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కస్టడీ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన కోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక లేఖలో ‘తాను నిర్దోషిని’ అని పేర్కొనడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

  • ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తనను అన్యాయంగా ఇరికిస్తోందని సీఐ నాగరాజు ఆ లేఖలో ఆరోపించారు.
  • సాయికృష్ణ కేసులో నన్ను బలవంతంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. సిట్ అధికారులు నన్ను భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్రంగా బెదిరిస్తున్నారు.
  • ఈ కేసు దర్యాప్తునకు నా కస్టడీతో ఎలాంటి అవసరమూ లేదు. కేవలం నన్ను మరింతగా ఈ కేసులో ఇరికించడం కోసమే సిట్ అధికారులు కస్టడీ కోరారు.
  • నన్ను విచారించాలనుకుంటే చట్టప్రకారం నా న్యాయవాదుల సమక్షంలో చేయవచ్చు. సిట్ అధికారులు నన్ను థర్డ్ డిగ్రీ లేదా టార్చర్ చేయకుండా చూడాలి అని న్యాయస్థానాన్ని వేడుకున్నారు.

సాయికృష్ణను స్టేషన్‌లో కొట్టి చంపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన అధికారి.. ఇప్పుడు తానే బాధితుడినంటూ లేఖ రాయడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు సూత్రధారులు ఎవరు?
సీఐ నాగరాజు లేఖతో ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఇంత పెద్ద ఘటన వెనుక కేవలం ఒక సీఐ పాత్రే ఉందా? లేక పై అధికారుల అండదండలు ఉన్నాయా? అన్న కోణంలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఒక యువకుడు మే 9 నుంచి పోలీస్ కస్టడీలో ఉండి కనిపించకుండా పోయినా, ఆ తర్వాత అతడి మృతదేహాన్ని మాయం చేసినా విజ‌య‌వాడ కమిషనరేట్ స్థాయి పెద్దలకు తెలియకుండా ఎలా జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

విజయవాడ సీపీ నిర్లక్ష్యంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ కేసులో కిందిస్థాయి సిబ్బందిని బలిపశువులను చేసి, పెద్ద తలకాయలను కాపాడేందుకు సిట్ ప్రయత్నిస్తోందని ఆక్షేపించింది. కేసులోని అసలు నిజానిజాలు, ఈ హత్య వెనుక ఉన్న పెద్దల పాత్ర నిగ్గుతేలాలంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ వల్ల కాదని, తక్షణమే ఈ కేసును సీబీఐ (CBI) కి అప్పగించాలని బాధిత కుటుంబంతో పాటు వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment