శ్రీశైలం ఎమ్మెల్యే ‘కిడ్నాప్’ ఫాంటసీ ..?

శ్రీశైలం ఎమ్మెల్యే ‘కిడ్నాప్’ ఫాంటసీ ..?

కర్నూలు జిల్లా (Kurnool District) శ్రీశైలం నియోజకవర్గ (Srisailam Constituency) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి (Budda Rajasekhar Reddy) వ్యవహారశైలి ఇప్పుడు సొంత పార్టీకి సైతం తలనొప్పిగా మారింది. అధికార అండతో ఆయన చేస్తున్న బెదిరింపులు, వరుస కిడ్నాప్‌లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. సామాన్య ఉద్యోగుల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు ఆయన సాగిస్తున్న ‘కిడ్నాప్ రాజకీయాలు’ (Kidnap Politics) చర్చనీయాంశంగా మారాయి. అస‌లు ఈ కిడ్నాప్ ఫాంట‌సీ (Kidnap Fantasy) ఏంట‌న్న చ‌ర్చ సొంత పార్టీలోనూ జ‌రుగుతోంది.

టోల్‌గేట్ వద్ద ‘నేనెవరో తెలియదా’
తాజాగా టోల్‌గేట్ ఉద్యోగి మహేష్‌ను (Mahesh) ఎమ్మెల్యే కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్తున్న క్రమంలో టోల్‌గేట్ వద్ద ముందున్న వాహనం యజమాని ఫోన్ పే ద్వారా టోల్ చెల్లిస్తుండటంతో ఎమ్మెల్యే వాహనం కాసేపు ఆగాల్సి వచ్చింది. దీనికే ఆగ్రహానికి లోనైన బుడ్డా రాజశేఖర్ రెడ్డి (Budda Rajasekhar Reddy) .. “నేనెవరో తెలియదా.. నీ కథ చూస్తాను” అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వెంటనే తన అనుచరులను పురమాయించి ఉద్యోగి మహేష్‌ను కారులో ఎక్కించుకుని తన స్వగ్రామమైన వేల్పనూరుకు ఎత్తుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

గతంలో అటవీ శాఖ సిబ్బంది కిడ్నాప్‌.. దాడి
బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో నల్లమల అటవీ ప్రాంతంలో రాత్రి వేళ విధుల్లో ఉన్న ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి దాడి చేశారు. అంత‌టితో ఆగ‌కుండా వారిని కిడ్నాప్ చేయించి, గెస్ట్ హౌస్‌లో బంధించి, వాకీటాకీలు, మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఈ కేసులో సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆయన్ను నిందితుడిగా చేర్చారు. ఈ ఘటనపై అటవీ శాఖ అసోసియేషన్ నాయకులు ఏకంగా మంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి ఫిర్యాదు చేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ప్రశ్నించిన మహిళపై బెదిరింపులు
ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమంలో.. సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) అప్లికేషన్ తీసుకోవడం లేదని నిలదీసిన ఒక బాధిత మహిళను కూడా ఎమ్మెల్యే బెదిరించడం సంచలనం రేపింది. దీంతో ఆ మ‌హిళ‌ “ఏం చంపిస్తావా?” అంటూ ఎమ్మెల్యేను ఎదురు నిలదీయడం బుడ్డా అరాచక పాలనకు అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ అధిష్టానం మౌనం వీడేనా?
అధికార పార్టీ ఎమ్మెల్యే వరుసగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా, ఉన్నతాధికారులపై దౌర్జన్యాలకు దిగుతున్నా పార్టీ అధిష్టానం మౌనంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. శ్రీశైలంలో పెరుగుతున్న ఈ కిడ్నాప్ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వివాదాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment