నెల్లూరు జిల్లా (Nellore District) అనంతసాగరంలో(Ananthasagaram) పోలీసులు (Police) నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో(Cordon Search) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రతి ఇంటిని, ఇళ్ల వద్ద ఉన్న వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ వ్యక్తి తన బైక్‌ను(Bike) మరో వీధిలో దాచిపెట్టాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన అతడి ఆరేళ్ల కుమారుడు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి తండ్రి బైక్ దాచిన విషయాన్ని చెప్పాడు.
అనంతసాగరంలో సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేయడంతో పాటు ఇళ్ల వద్ద ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో సురేష్(Suresh) అనే వ్యక్తి సరైన పత్రాలు (Proper Documents) లేని తన బైక్‌ను ఇంటి వద్ద కాకుండా మరో వీధిలోకి తీసుకెళ్లి దాచిపెట్టాడు.
పోలీసులు తనిఖీలను గమనిస్తున్న సురేష్ ఆరేళ్ల కుమారుడు మహేంద్ర(Mahendra).. తన తండ్రి బైక్‌ను వేరే ప్రాంతంలో దాచిపెట్టడాన్ని గుర్తించాడు. నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. తన తండ్రి బైక్‌ను మరోచోట దాచిపెట్టాడని వారికి చెప్పాడు. అంతటితో ఆగకుండా.. బైక్ ఎక్కడ దాచారో పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లి మరీ చూపించాడు.
ఆరేళ్ల బాలుడు ఎంతో ధైర్యంగా తన తండ్రి బైక్ దాచిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసుల తనిఖీలను గమనిస్తూ.. తండ్రి చేసిన పనిని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన బాలుడి తెగువను పలువురు మెచ్చుకుంటున్నారు. పోలీసులకు తండ్రి బైక్‌ను పట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.








