సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. నైనీ గని నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రైలు!

సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. నైనీ గని నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రైలు!

Summarize with AI

తెలంగాణ (Telangana) రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చే దిశగా సింగరేణి (Singareni) చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఒడిశాలోని ‘నైనీ’ బొగ్గు బ్లాక్ (Naini Coal Block), ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధితో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఒడిశాలోని (Odisha) నైనీ గని నుంచి తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (Singareni Thermal Power Plant) తొలి బొగ్గు రైలు (First Coal Train) విజయవంతంగా చేరుకుంది. ఇది తెలంగాణ ఇంధన భద్రతలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది.

ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అలుపెరగని కృషి, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (A. Revanth Reddy) ప్రత్యేక చొరవ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అనుమతుల సాధనలో ఎదురైన ఎన్నో అడ్డంకులను పటాపంచలు చేస్తూ ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారని పేర్కొంది. అనుమతుల కోసం భట్టి విక్రమార్క స్వయంగా రెండుసార్లు ఒడిశా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2024 జులైలో ఒడిశా ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి, ఆటంకాలన్నీ తొలగించారని సర్కార్ స్పష్టం చేసింది. అనంతరం 2025 ఏప్రిల్ 16న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం ప్రారంభించారు.

ఆ శ్రమ ఫలితంగా నైనీ గని నుంచి బయలుదేరిన తొలి రైలు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణ గడ్డపైకి చేరుకుంది. 59 బాక్స్ వ్యాగన్ల ద్వారా ఏకంగా 4 వేల టన్నుల అత్యుత్తమ జీ-10 (G-10) గ్రేడ్ నాణ్యమైన బొగ్గు సింగరేణి థర్మల్ కేంద్రానికి చేరింది. కేంద్ర బొగ్గు శాఖ 2015 ఆగస్టు 13న సింగరేణికి కేటాయించిన ఈ నైనీ గని, మొత్తం 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ గని జీవితకాలం 36 సంవత్సరాలు కాగా, ఏడాదికి కోటి టన్నుల (10 మిలియన్ టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో నడవనుంది. నైనీ నుంచి నాణ్యమైన బొగ్గు రాకతో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిలో ఇకపై ఎలాంటి ఆటంకాలు ఉండవని, భవిష్యత్తు తరాలకు నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టమవుతోంది. సింగరేణి కీర్తి కిరీటంలో ఈ నైనీ బొగ్గు గని మరో వజ్రంగా నిలిచిపోనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment