దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంలో అత్యున్నత స్థాయి పోలీసు అధికారుల పాత్రపై సంచలన మలుపు తిరిగింది. ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, సౌత్‌జోన్ ఏసీపీ ఎం. మానసలను నిందితులుగా చేర్చాలని కోరుతూ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున ఇవాళ ఈ పిటిషన్ సమర్పించారు.
ఈ పిటిషన్‌లో ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను A-1గా, విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును A-2గా, ఏసీపీ ఎం. మానసను A-3గా పేర్కొనడం రాష్ట్ర పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మే 6న మార్కాపురంలో విజయవాడ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందమే సాయికృష్ణను అదుపులోకి తీసుకుంది. టాస్క్‌ఫోర్స్ విభాగం సీపీ ఆధీనంలోనే పనిచేస్తున్నందున, ఈ అరెస్టు సమాచారం ఆయనకు తెలియదనడం సాధ్యం కాదని పిటిషనర్ వాదించారు.
సాయికృష్ణను మే 6 నుంచి 9 వరకు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లు సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. అయితే, జూన్ 15న హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో మాత్రం అతడి ఆచూకీ తెలియదని పోలీసులు చెప్పడం గమనార్హం. మే 28నే సాయికృష్ణ అక్రమ నిర్బంధం, ప్రాణహానిపై డీజీపీ, సీపీలకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, అతడి ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
పోలీస్‌స్టేషన్ సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ల మార్పు, ఫుటేజీ మాయం చేయడం, మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, సెల్‌ఫోన్ ద్వారా నకిలీ ఆధారాలు సృష్టించడం కేవలం కిందిస్థాయి పోలీసుల పని కాదని, ఇది ఉన్నతస్థాయిలో జరిగిన కుట్ర అని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తు కేవలం కిందిస్థాయి సిబ్బందికే పరిమితమైందని, ఉన్నతాధికారుల పాత్రను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని ఫిర్యాదుదారు ఆరోపించారు.
“పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, అక్రమంగా నిర్బంధించడం అధికారిక విధుల్లో భాగం కాదని” సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను పిటిషనర్ ఉదహరించారు. కాబట్టి ప్రభుత్వ అధికారులపై విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సిట్ దర్యాప్తుతో పాటు ఈ ప్రైవేట్ ఫిర్యాదును కలిపి విచారించేందుకు BNSS సెక్షన్ 233ను అమలు చేయాలి. “ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కారు” అనే సూత్రం ప్రకారం ఫిర్యాదును విచారణకు స్వీకరించి, డీజీపీ సహా ఇతర అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌పై విజయవాడ కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయం, పోలీస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.








