బీజేపీ (BJP) అగ్రనేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు(Son) బండి భగీరథ్‌పై(Bandi Bhagirath) నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించిన తీరు, పోలీసుల తాత్సారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో(Pet Basheerabad Police Station) బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ కేసుపై తక్షణమే విచారణ ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను(CV Anand) సీఎం ఆదేశించారు. అయితే, తీవ్రమైన ఆరోపణలు ఉన్న ఈ కేసులో నిబంధనల ప్రకారం జరగాల్సిన అరెస్టులు కాకుండా, కేవలం ‘విచారణ’కు ఆదేశించడంపై బాధితులు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
డీజీపీని ప్రశ్నించిన రేవంత్..
మే 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని(DGP) సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ.. గత రెండు రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) హైదరాబాద్ పర్యటనలో ఉన్నందున పోలీస్ యంత్రాంగమంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైందని వివరణ ఇచ్చారు.
పోక్సో చట్టం ప్రకారం.. కేసు నమోదైన 24 గంటల్లోపు నిందితుడిని అరెస్ట్ చేయాలి. అవసరమైతే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి. కానీ, దేశమంతా మారుమోగుతున్న ఈ ఘటనపై మూడు రోజుల వరకు ప్రభుత్వం స్పందించకపోవడం, ఇప్పుడు కేవలం విచారణ చేయాలని చెప్పడం ప్రజలను అమాయకులను చేయడమేనని విమర్శలు వస్తున్నాయి.
సాధారణ పౌరుల విషయంలో కఠినంగా ఉండే పోలీసులు, రాజకీయ నేతల పుత్రరత్నాల విషయంలో ఎందుకు వెనకాడుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా ఈ విచారణ ఆదేశాలకు ఒకరోజు ముందే.. నిందితుడి తండ్రి బండి సంజయ్‌ను తన ‘ప్రియ మిత్రుడు’గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఈ స్నేహం వల్లే కేసును నీరుగారుస్తున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
శాంతిభద్రతల విషయంలో ‘జీరో టాలరెన్స్'(Zero Tolerance) అని చెప్పే రేవంత్ రెడ్డి.. తన మిత్రుడి కుమారుడి విషయంలో మాత్రం భిన్నంగా ఎలా వ్యవహరిస్తారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసులు చేస్తున్న తాత్సారం, ప్రభుత్వం చూపిస్తున్న ఉదారత అంతా ప్రజలు గమనిస్తున్నారని, ఈ కేసులో చట్టం తన పని తాను చేయకపోతే ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే నిందితుడిని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.








