‘తానా’లో నైతిక సంక్షోభం.. ప్రశ్నార్థకంలో సంస్థ ప్రతిష్ఠ?

'తానా'లో నైతిక సంక్షోభం.. ప్రశ్నార్థకంలో సంస్థ ప్రతిష్ఠ?

Summarize with AI

ఉత్తర అమెరికాలో (North America) తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలకు ప్రతీకగా దశాబ్దాలుగా గుర్తింపు పొందిన తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా)(TANA – Telugu Association of North America) ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2027లో 50వ వార్షికోత్సవం (గోల్డెన్ జూబ్లీ)(Golden Jubilee) జరుపుకోబోతున్న సమయంలో సంస్థలో అధికార పోరు, గ్రూపు రాజకీయాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలు, పరిపాలనా లోపాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఒకప్పుడు ప్రవాస తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచిన తానా, ఇప్పుడు నైతిక విలువలు, పారదర్శకత ఆరోపణలతో ప్రతిష్ఠ కోల్పోయే దశకు చేరుకుంది.

సంస్థ పురోగతి, ఆర్థిక లావాదేవీలు(Financial Transactions), ఫౌండేషన్ నిధుల వినియోగం (Foundation Fund Utilization), సేవా కార్యక్రమాలపై చర్చించాల్సిన బోర్డు సమావేశాలు దాదాపు ఏడాది కాలంగా జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సంస్థలో ఏమి జరుగుతోంది? నిధుల నిర్వహణ ఎలా ఉంది? సమావేశాలను ఎవరు అడ్డుకుంటున్నారు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాధారణ పరిపాలనా లోపం కాదని, సభ్యులు, దాతల పట్ల బాధ్యతారాహిత్యమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తానా సేవా కార్యక్రమాలకు సంబంధించిన కార్పొరేట్ మ్యాచింగ్ ఫండ్స్ (Corporate Matching Funds) వినియోగంపై కూడా ఆరోపణలు వచ్చాయి. దాతలు అందించిన విరాళాలు, కార్పొరేట్ సంస్థల మ్యాచింగ్ గ్రాంట్స్ నిజంగా ఎక్కడ ఖర్చయ్యాయి? లబ్ధిదారులు ఎవరు? ఖర్చులకు సరైన ఆమోదం ఉందా? పూర్తిస్థాయి ఆడిట్ జరిగిందా? వంటి ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదని సభ్యులు అంటున్నారు. అమెరికాలోని ప్రముఖ సంస్థల మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు సంస్థ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.

ఈ వ్యవహారం ఫెడరల్ సంస్థల దృష్టికి వెళ్లిందని, ఎఫ్‌బీఐ నిఘా కూడా ఉందన్న ప్రచారం జరుగుతున్నా, తానా నాయకత్వం నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు నిరాధారమైతే ఆధారాలతో ఖండించాలని, నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరుతున్నారు.

3 మిలియన్ డాలర్లకు పైగా (రూ.28 కోట్లకు పైగా) నిధుల దుర్వినియోగం జరిగిందని తానా ఫౌండేషన్ మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పొలవరపు (Srikanth Polavarapu) పేరుతో వ‌చ్చిన ఆరోపణలు సంస్థలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంపై ఆరోపణలు వచ్చినప్పటికీ, నిధులను తిరిగి రాబట్టేందుకు ప్రస్తుత నాయకత్వం తీసుకున్న చర్యలపై స్పష్టత లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, వాస్తవాలను బయటపెట్టాలని, దుర్వినియోగం జరిగి ఉంటే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

తానా వంటి సేవా సంస్థకు సభ్యుల విశ్వాసం, దాతల నమ్మకమే బలమని, అవే దెబ్బతింటే సంస్థ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని సీనియర్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పెద్దల త్యాగాలు, వేలాది మంది సభ్యుల కృషితో ఎదిగిన సంస్థను వ్యక్తిగత ఆధిపత్య పోరాటాలకు వేదికగా మార్చకూడదని వారు సూచిస్తున్నారు.

2027 గోల్డెన్ జూబ్లీ (Golden Jubilee) వేడుకలకు ముందు తానాలో పారదర్శకత, నైతికత, జవాబుదారీతనాన్ని పునరుద్ధరించాలని సభ్యులు కోరుతున్నారు. అందులో భాగంగా గత ఏడాది బోర్డు సమావేశాలు ఎందుకు జరగలేదో స్పష్టత ఇవ్వాలి. సంస్థ ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ (Independent Forensic Audit) నిర్వహించాలి. కార్పొరేట్ మ్యాచింగ్ ఫండ్స్‌పై సమగ్ర నివేదిక విడుదల చేయాలి. ఫౌండేషన్ నిధులపై వచ్చిన ఆరోపణలపై వాస్తవాలను సభ్యుల ముందుంచాలి. దుర్వినియోగం జరిగి ఉంటే నిధులను తిరిగి రాబట్టేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

తానా ఏ ఒక్కరి వ్యక్తిగత సంస్థ కాదని, వేలాది మంది సభ్యులు, దాతల విశ్వాసంతో నిర్మితమైన సామూహిక వేదిక అని సభ్యులు గుర్తుచేస్తున్నారు. పదవులు తాత్కాలికమైనవే అయినా, సంస్థ ప్రతిష్ఠ శాశ్వతమని చెబుతున్నారు. అధికార పోరాటాల కంటే సంస్థ ప్రయోజనాలను ముందుంచి, సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, ఆరోపణలపై నిజానిజాలు బయటపెట్టి పారదర్శకతను పునరుద్ధరించాలని తానా ప్రస్తుత నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. లేకపోతే 50 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సంస్థపై శాశ్వత మచ్చ పడే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment