గిగ్ వర్కర్ల (Gig Workers) కష్టాలు, వారి సమస్యలు తనకు తెలుసని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కార్మికులకు అండగా ఉంటామని గతంలో ఇచ్చిన హామీని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు.
గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చామని రాహుల్ గుర్తుచేశారు. దేశంలో ఇప్పటివరకు గిగ్ వర్కర్లకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేదని అన్నారు. ఒక్కో డెలివరీకి ఎంత సమయం పడుతోంది? దానికి ఎంత పారితోషికం లభిస్తోంది? వంటి వివరాలు కూడా కార్మికులకు తెలియడం లేదని పేర్కొన్నారు. వారి పనికి సంబంధించిన సమాచారాన్ని వారికే అందుబాటులోకి తీసుకురావడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.
ఎండ, వానలను లెక్కచేయకుండా రోడ్లపై తిరుగుతూ డెలివరీలు చేసే కార్మికులకు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతులు లేవని రాహుల్ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర నగరాల్లో ప్రభుత్వం రెస్ట్ హౌస్‌లు ఏర్పాటు చేసిందని వివరించారు.
గిగ్ వర్కర్లకు ఆరోగ్య, భద్రతా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రమాద బీమా కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పింఛన్‌తో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలు కూడా అందించనున్నట్లు తెలిపారు.
ప్రతి డెలివరీ, రవాణా లావాదేవీపై ఒక శాతం మొత్తాన్ని గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి జమ చేసే విధానం ఉందని రాహుల్ వివరించారు. ఈ నిధులను గిగ్ వర్కర్ల బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమానికి వినియోగిస్తామని పేర్కొన్నారు.
దేశంలో రెండు భిన్నమైన ఆలోచనా విధానాలు ఉన్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానం కార్మికుల శ్రమను దోచుకునేలా ఉందని విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్ గిగ్ వర్కర్లను దేశ అభివృద్ధికి పునాదిగా, కీలక భాగస్వాములుగా భావిస్తోందని అన్నారు.
కార్మికులకు తగిన గుర్తింపు, విశ్రాంతి, ప్రతి డెలివరీలో న్యాయమైన వాటా లభించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల పిల్లల విద్య, వారి ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెబుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
చివరగా గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పునరుద్ఘాటించిన రాహుల్ గాంధీ.. ‘జై హింద్, జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.










