స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ సాగిస్తున్న పొలిటికల్ గేమ్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలోని పొందూరు మండలంలో ఐదుగురు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి, వారే స్వయంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చూపిస్తూ ఏకగ్రీవాలు చేసుకునేందుకు టీడీపీ నేతలు పన్నిన కుట్రను వైసీపీ బయటపెట్టింది.
కుట్ర రాజకీయంపై వైసీపీ నేత చింతాడ రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దౌర్జన్యపూరిత ఘటనను శ్రీకాకుళం జిల్లా ఎన్నికల చరిత్రలోనే అత్యంత చీకటి రోజుగా ఆయన వర్ణించారు. పోటీలో ఉన్న ఐదుగురు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు వారి ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
నిజమైన అభ్యర్థులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా, అధికారుల కుమ్మక్కుతో ఆ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించుకునేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
ఈ దొంగ నామినేషన్ల ఉపసంహరణల వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ హస్తం ఉందని, ఆయనే నేరుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థలను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతో గెలిచే ధైర్యం లేకనే కూన రవికుమార్ ఇటువంటి నికృష్టమైన కుట్రలకు తెరదీశారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ నియమాలను కాలరాస్తూ అధికార పార్టీకి కొమ్ముకాసిన సదరు రిటర్నింగ్ అధికారి (RO) పై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. ప్రజల తీర్పును ఎదుర్కోలేక ఫోర్జరీ సంతకాలతో ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలపై, ఎమ్మెల్యే కూన రవికుమార్ అరాచకాలపై ఉన్నతాధికారులకు, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.








