ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై యావత్ దేశం మొత్తం తీవ్ర విమర్శలు చేస్తోంది. మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు కూటమి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, సీపీఐ జాతీయ నాయకుడు కే. రామకృష్ణ చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు నాయుడి ‘40 ఏళ్ల ఇమేజ్’ ఈ స్థానిక ఎన్నికల దౌర్జన్యాలతో పూర్తిగా గంగలో కలిసిపోయిందని, ఆయన నాయకత్వానికి ఇవి చెరిపివేసి మాయని మచ్చగా మిగిలిపోతాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగంలో, ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేనంత నికృష్టంగా, అత్యంత అధ్వాన్నంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. పోటీ చేసే హక్కును కాలరాస్తూ ప్రతిపక్షాలను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని, నామినేషన్లు వేసిన వారి సంతకాలను ఫోర్జరీ చేసి అక్రమంగా ఉపసంహరించుకున్నట్లు (విత్‌డ్రా) సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు అధికార కూటమి పార్టీకి జీతగాళ్లలా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ గూండాలు చేయాల్సిన అరాచకాలను, ప్రతిపక్ష నేతలను అడ్డుకునే పనులను స్వయంగా పోలీసు యంత్రాంగమే ముందుండి నడిపిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిద్రపోతోందని, కళ్లున్నా చూడలేని గుడ్డిదానిలా మారాయని ఎద్దేవా చేశారు. అధికార టీడీపీ, పోలీసులు, ఎన్నికల సంఘం మూడూ కుమ్మక్కై ప్రజాస్వామిక వ్యవస్థలను బలితీసుకుంటున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇంత అరాచకం సాగుతుంటే కూటమి భాగస్వాములైన పవన్ కళ్యాణ్, పీవీఎన్ మాధవ్ లు చంద్రబాబుకు డబ్బా కొడుతూ, భజన చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యంగా సాధిస్తున్న ఏకగ్రీవాలను గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో దుర్మార్గాలు చేస్తూ మళ్లీ నీతి మాటలు చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని, ఈ తరహా నియంతృత్వ వైఖరిని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఉపేక్షించరని సీపీఐ నాయకుడు రామకృష్ణ హెచ్చరించారు.








