బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, అనకాపల్లి జిల్లాలోని కన్నూరిపాలెంలో అత్యధికంగా 23.15 సెం.మీ. వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలోని 16వ పోలీస్ బెటాలియన్ పరిసరాల్లో 22.39 సెం.మీ., పెందుర్తి మండలం చీమలపల్లిలో 22 సెం.మీ. వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లాలోని పరవాడలో 21.78 సెం.మీ., విశాఖలోని సింహాచలంలో 21.08 సెం.మీ., అచ్యుతాపురంలో 20.68 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
పలు జిల్లాల్లో కుండపోత వర్షం
పలు జిల్లాల్లోని భారీ వర్షాలు కురవడంతో రహదారులపై నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నెలికొరిగాయి. కాకినాడ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం ముందుకు వచ్చింది. సముద్రపు అలలకు రొడ్లు దెబ్బతిన్నాయి.
ఆర్నబ్ తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు వద్ద గంటకు 87 కిలోమీటర్లు, భీమవరంలో గంటకు 78 కిలోమీటర్లు, అనకాపల్లిలో గంటకు 57 కిలోమీటర్లు, నర్సాపురంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు నమోదయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.








