ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో సరికొత్త భూవివాదం తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, జన్వాడ గ్రామంలో ఉన్న “కోడి చెరువు”ను పవన్ కళ్యాణ్ అక్రమంగా కబ్జా చేశారంటూ ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.
రూ. 500 కోట్ల విలువైన 10 ఎకరాల చెరువు
సదరు జర్నలిస్ట్ విడుదల చేసిన కథనం ప్రకారం.. జన్వాడ పరిధిలోని దాదాపు రూ. 500 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 10 ఎకరాల కోడి చెరువు భూమిని పవన్ కళ్యాణ్ అత్యంత తెలివిగా తన అధీనంలోకి తీసుకున్నట్లు ఆరోపించారు. దీనికి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు, భూ రికార్డులను కూడా సేకరించినట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
శంకర్ పల్లి మండలం జన్వాడలో ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటంతో ఇక్కడి భూములకు విపరీతమైన ధరలు ఉన్నాయి. అక్కడ ఉన్న ‘కోడి చెరువు’ను ఆక్రమించారనేది ప్రధాన ఆరోపణ. “మా నాయకుడు అవినీతికి వ్యతిరేకం, రూపాయి కూడా తప్పుగా తీసుకోరు” అని గర్వంగా చెప్పుకునే జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

రంగంలోకి ‘హైడ్రా’? ఏం చేయబోతోంది?
తెలంగాణలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని హైడ్రా (HYDRAA) అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖుల అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై వచ్చిన ఈ 500 కోట్ల చెరువు భూమి కబ్జా ఆరోపణలపై స్పందిస్తుందా? ఆ స్థలాన్ని కాపాడుతుందా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసిన వివాదాలు
ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ తీరుపై తెలంగాణకు చెందిన పలువురు మేధావులు, జర్నలిస్టులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనికి కౌంటర్‌గా తెలంగాణ జనసేన నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ వైరుధ్యంగా మారుతున్న తరుణంలోనే.. కరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌పై ఈ ‘కోడి చెరువు’ కబ్జా బాంబు పేలడం సంచలనంగా మారింది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వ లేదా హైడ్రా అధికారుల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








