‘పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే నన్ను చంపాలని కుట్ర‌’

'పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే నన్ను చంపాలని కుట్ర‌'

అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) ఏజెన్సీ ప్రాంతంలో పాస్టర్ (Pastor), భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ్ దర్శన్‌పై (Abhinay Darshan) గుర్తుతెలియని దుండగులు మారణాయుధాలతో ఘోరంగా దాడికి తెగబడ్డారు. అభినయ్ దర్శన్ కారులో ప్రయాణిస్తుండగా జికే వీధి మండలం, జెర్రెల పరిధిలో దుండగులు దారి కాసి పాశవికంగా దాడి (Attack) చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో రక్తపు మడుగులో పడివున్న ఆయనను గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి జెర్రెల ప్రభుత్వ ఆసుపత్రికి (Jerrela Government Hospital) తరలించారు.

పోలీసులు డ‌బుల్ గేమ్ – అభిన‌య్ ద‌ర్శ‌న్‌
ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం పాస్టర్ అభినయ్ దర్శన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గతంలో పాస్ట‌ర్ ప్రవీణ్ పగడాల (Praveen Pagadala) లాగే నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నాపై దాడి చేసిన నిజమైన దుండగులను వదిలేసి, నా అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. నాపై నేనే దాడి చేయించుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు.

“ఈ కేసులో పోలీసులు డబుల్ గేమ్ (Double Game) ఆడుతున్నారు. పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. నాపై జరిగిన దాడి వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ దాడి వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు (Visweswara Raju) గారికి సంబంధం ఉందని నేను అనుకోను. కానీ కొంతమంది వ్యక్తులపై నాకు బలంగా అనుమానం ఉంది. వారి పేర్లను త్వరలోనే మీడియా ముందు బయటపెడతాను.”

“గతంలో ప్రవీణ్ పగడాల నాలుగు బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించినట్లే.. ఇప్పుడు నా విషయంలోనూ కుట్రలు చేస్తున్నారు.” అని అభినయ్ దర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ ట్వీట్.. ఖండించిన వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు
ఇదిలావుండగా, ఈ దాడి జరిగిన వెంటనే టీడీపీ(TDP) తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా స్పందించింది. ఈ ఘోర దాడిని వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజుకు అంటగడుతూ టీడీపీ ట్వీట్ చేసింది. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా వైసీపీపై టీడీపీ బురదజల్లుతోందని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకే.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైసీపీపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.

ఈ దాడి ఘటనతో అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment