అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ‘భరోసా’ రాజకీయ పార్టీ (Bharosa Political Party) వ్యవస్థాపకుడు, పాస్టర్ (Pastor) ధార అభినయ్ దర్శన్‌పై (Dhara Abhinay Darshan) హత్యాయత్నం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఆయనపై ఎలాంటి నిజమైన దాడి జరగలేదని, ఇదంతా సానుభూతి, సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఆడిన పక్కా డ్రామా అని జిల్లా ఎస్పీ (District SP) అమిత్ బర్దర్ (Amit Bardar) నేతృత్వంలోని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ “నకిలీ దాడి” (Fake Attack) కుట్రకు సంబంధించి పాస్టర్ అభినయ్ దర్శన్‌తో సహా మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నాటకానికి (Drama) సంబంధించిన ప్లాన్ మొత్తం అభినయ్ దర్శన్ ముందే సిద్ధం చేసుకున్నారు. జీకే వీధి మండలానికి చెందిన వసంత్ కుమార్ (Vasanth Kumar) అనే గిరిజన యువకుడిని ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించిన పాస్టర్.. తనపై దాడి జరిగినట్టు నటించాలని, అలా చేస్తే డబ్బులు ఇస్తానని ఆఫర్ చేశారు. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్ మొత్తాన్ని ఫోన్ పే (PhonePe) ద్వారా చెల్లించినట్టు డిజిటల్ ఆధారాలను పోలీసులు సేకరించారు.
సోమవారం నీరుతోటపాలెం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు తన కారుపై గుడ్లు విసిరి, కత్తులతో (Knives) దాడి చేశారంటూ అభినయ్ దర్శన్ గాయాల నాటకమాడి ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయన ఇన్స్టాగ్రామ్ చాట్ హిస్టరీ(Instagram Chat History), లీకైన ఆడియో సందేశాలు, “తనకు ఎలాంటి గాయాలు కాలేదు” అని తేల్చిన వైద్యుల నివేదికలతో ఈ హైడ్రామా 24 గంటల్లోనే తుస్సుమంది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే.. క్షేత్రస్థాయిలో నిజానిర్ధారణ చేసుకోకుండానే తెలుగుదేశం పార్టీ (TDP) అధికారిక వర్గాలు హడావిడిగా స్పందించడం చర్చనీయాంశమైంది. ఈ దాడి వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రాజు (Vishweshwar Raju) హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తీరా పోలీసులు ఇదంతా పాస్టర్ ఆడిన డ్రామా అని తేల్చడంతో నెటిజన్లు టీడీపీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
“ప్రాథమిక సమాచారం కూడా లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష నేతలపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారా? ఇప్పుడు పోలీసులు అసలు నిజం బయటపెట్టారు.. దీనికి ఏం సమాధానం చెబుతారు?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.









