వీసా రెన్యువల్(Visa Renewal) మోసం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ రమానందన(YouTuber Ramanandana)(నందూస్ వరల్డ్) ఇబ్రహీంపట్నం పోలీసుల (Ibrahimpatnam Police) ఎదుట హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన విచారణలో నందన నోరు విప్పలేదని, పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని సమాచారం. విచారణలో వీసా రెన్యువల్ లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, డెస్టినీ కన్సల్టెన్సీ(Destiny Consultancy) వ్యవహారాలను తన భర్త మధుకర్(Madhukar) చూసుకుంటారని ఆమె పోలీసులకు తెలిపారు.
పోలీసుల విచారణ అనంతరం రమానందన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ వ్యవహారంపై తాను ప్రస్తుతం ఏమీ మాట్లాడదలుచుకోలేదని, తనపై మీడియానే ప్రచారం చేసిందని ఎదురుదాడికి దిగడం గమనార్హం.
కాగా, రమానందన విచారణ అనంతరం ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం(Subrahmanyam) తెలిపిన వివరాల ప్రకారం.. క్రాంతికుమార్(Kranthi Kumar) ఫిర్యాదు మేరకు రమానందన, ఆమె భర్త మధుకర్‌తో పాటు మధుకర్ తండ్రి మోహనరావుపై(Mohan Rao) కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేశామన్నారు. విచారణకు హాజరవుతానని రమానందన పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చి, తనపై జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసులను(Lookout Notices) తొలగించాలని కోరినట్లు సీఐ తెలిపారు. దీంతో ఆమె ప్రస్తుతం మూడు వారాల సెలవుపై భారత్‌కు(India) వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యారు.
విచారణలో ఆమె డెస్టినీ కన్సల్టెన్సీ(Destiny Consultancy) వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ సంస్థకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ తన భర్త మధుకర్ చూసుకుంటారని విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. వీసా రెన్యువల్‌కు సంబంధించిన లావాదేవీలతో తనకు సంబంధం లేదని ఆమె పేర్కొన్నట్లు చెప్పారు.
కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 16న రమానందనను మరోసారి విచారించనున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఆమె యూకేకు తిరిగి వెళ్లిన తర్వాత ఆమె భర్త మధుకర్ కూడా విచారణకు హాజరవుతారని పోలీసులు చెబుతున్నారు.








