సభాపతిని దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డిలను తెలంగాణ శాసన మండలి సస్పెండ్ చేసింది. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ ప్రభుత్వం.. ఇద్దరు ఎమ్మెల్సీలు సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించారని, సభాపతి గౌరవం, రాజ్యాంగబద్ధ హోదాకు భంగం కలిగించేలా ప్రవర్తించారని తీర్మానంలో పేర్కొంది.
రాజకీయ విభేదాల పేరుతో సభాపతి అధికారాన్ని, హోదాను అవమానించడం సహించబోమంటూ.. తెలంగాణ శాసనసభ గౌరవానికి విఘాతం కలిగించే చర్యగా ఎమ్మెల్సీల ప్రవర్తనను తీర్మానంలో పేర్కొంది. మహిళా సభ్యుల సమక్షంలో ఇద్దరు ఎమ్మెల్సీలు అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపైనా సభ తీవ్రంగా స్పందించింది.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీల ప్రవర్తనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యత వహించాలని సభ తీర్మానంలో పేర్కొంది. సభాపతికి కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. సభలో చేసిన తీర్మానాలను శాసనమండలికి పంపించింది ప్రభుత్వం. సభా హక్కుల ఉల్లంఘన అంశంపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని కోరింది.
శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలను ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మరోసారి రాజకీయ వాగ్వాదానికి అవకాశం ఏర్పడింది. సభా మర్యాదలు, సభ్యుల ప్రవర్తన, సభాపతి హోదా అంశాలపై ఈ తీర్మానం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.








