మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’(Kaaka)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) పతాకంపై వెంకట్ కె. నారాయణ (Venkat K. Narayana) నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.
తాజాగా యువ నటి అనశ్వర రాజన్ (Anaswara Rajan) పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. సినిమాలో ఆమె ‘అమ్ములు’(Ammulu) అనే పాత్రలో కనిపించనుండగా.. చిరంజీవి కుమార్తెగా, ఎంబీబీఎస్ విద్యార్థినిగా ఆమె పాత్రను పరిచయం చేశారు. ఫస్ట్‌లుక్‌లో అనశ్వర రాజన్(Anaswara Rajan) సింపుల్, హోమ్లీ లుక్‌లో కనిపిస్తుండగా.. ఆమె వెనుక చిరంజీవి నిల్చున్నట్లు పోస్టర్‌ను రూపొందించారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో(Malayalam Film Industry) నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనశ్వర రాజన్.. ‘కాకా’తో టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడితో కలిసి నటించే అవకాశం ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. ‘అమ్ములు’ పాత్ర కథలో కీలకంగా ఉండబోతున్నట్లు ఫస్ట్‌లుక్ ద్వారా స్పష్టమవుతుండటంతో.. చిరంజీవి, అనస్వర మధ్య తండ్రీకూతుళ్ల బంధం సినిమాలో ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉండేలా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘కాకా’కు సంబంధించిన తదుపరి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








