దీపావళి పండుగ సందర్భంగా వచ్చిన ఆనందం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం ఎన్నో హృదయ విదారక గాథలకు వేదికైంది. పండుగకు వచ్చి, తిరిగి వెళ్తూ.. అనంత లోకాలకు పయనమైన తల్లి, కొడుకుల కథ ఇప్పుడు అందరి కళ్లు చెమర్చేలా చేస్తోంది.
బెంగళూరుకు చెందిన ఫీల్ మన్ బేబీ (64), ఆమె కుమారుడు కిశోర్ కుమార్ (41) బంధువులను కలుసుకోవడానికి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలో ఉంటున్న అక్క పద్మ ప్రియ, బావ రాము ఇంటికి వచ్చారు. దీపావళి సంతోషాలను పంచుకుని, జ్ఞాపకాల మూటలతో తిరిగి ప్రయాణమయ్యారు. నిన్న రాత్రి పటాన్ చెరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వీరు కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కారు.
కానీ, ఆ ప్రయాణం మృత్యుప్రయాణంగా మారుతుందని వారెప్పుడూ ఊహించలేదు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బస్సు మంటల్లో చిక్కుకుంది. గాఢ నిద్రలో ఉన్న ఈ తల్లి, కొడుకు మంటల నుంచి బయటపడలేకపోయారు. చివరికి, ఒకరినొకరు వీడకుండా.. మృత్యు ఒడిలోకి చేరిపోయారు. బస్సు ప్రమాదంలో వీరు ఇరువురు సజీవ దహనమైనట్లు పోలీసులు నిర్ధారించారు.
పండుగ వేళ ఇంటికి వచ్చిన ఆత్మీయులు.. కళ్ల ముందే కాలి బూడిదవడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఇంట్లో దీపాలు వెలిగే వేళ.. ఆ తల్లి, కొడుకుల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పండుగకు వచ్చి.. మృత్యువుకు అతిథులుగా మారిన ఆ దురదృష్టవంతుల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.








