మారికవలసలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ నేతల అరెస్టు

మారికవలసలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ నేతల అరెస్టు

Summarize with AI

విశాఖపట్నం జిల్లా మారికవలసలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లిష్‌ మీడియం స్కూల్ తరలింపుని అడ్డుకుంటూ.. గిరిజన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గిరిజన మహిళా నేత, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు మారికవలసకు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప‌ట్ల‌ పోలీసులు అమర్యాదగా వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్రంగా ప్ర‌తిఘ‌టించారు. పోలీసులు ఆమె ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గిరిజన మహిళల పట్ల ఇంత చులకనగా వ్యవహరించడం ఏమిటని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు అండగా శాంతియుతంగా పోరాటం చేయడం కూడా తప్పేనా అని నిలదీశారు. తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న గిరిజనులను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

మారికవలసలోని గిరిజన హాస్టల్‌ పరిసర ప్రాంతం మొత్తం పోలీసు వలయంలోకి వెళ్లింది. హాస్టల్‌కు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను అడ్డుకున్నారు. గిరిజనుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలను ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టులు చేశారు.

మరోవైపు మంగళవారం రాత్రి మారికవలస గిరిజన హాస్టల్‌ వద్ద అధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్‌ గేటు ముందు గిరిజనులు శాంతియుతంగా నిరసన చేపట్టగా.. అక్కడ కూర్చోకుండా హాస్టల్‌ సిబ్బంది నీళ్లు పోశారని విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమపై ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హాస్టల్‌ వద్ద నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. గిరిజన విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

గిరిజన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో మారికవలసలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అడ్డుకుంటుండగా.. మరోవైపు తమ హక్కుల కోసం వెనక్కి తగ్గేది లేదని గిరిజనులు చెబుతున్నారు.

శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని అడ్డుకోవడం, మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లిష్‌ మీడియం స్కూల్ తరలింపుని అడ్డుకుంటూ విద్యార్థుల త‌ల్లిదండ్రులు చేప‌ట్టిన పోరాటం ఉధృతంగా మారుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment