రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, హింసాకాండపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సాక్ష్యాధారాలతో సహా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకనే చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ‘నారాసుర రక్తచరిత్ర’ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రెస్మీట్లోని ముఖ్యాంశాలు సంక్షిప్తంగా క్రింది విధంగా ఉన్నాయి:
ప్రజామద్దతు లేదనే భయంతోనే చంద్రబాబు ఎన్నికలను స్వేచ్ఛగా జరగనీయకుండా అడ్డుకుంటున్నారని, నామినేషన్లు వేయడానికి వెళ్తున్న విపక్ష అభ్యర్థులపై పోలీసుల సహకారంతో దాడులు చేయిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ గుండాలు మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నా, రిటర్నింగ్ అధికారుల సమక్షంలోనే పత్రాలు లాక్కుంటున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. పుంగనూరులో లోక్సభ పక్ష నేత మిథున్రెడ్డిపై హత్యాయత్నం, పులివెందులలో పోలీసుల బాష్పవాయు ప్రయోగం, గాలిలోకి కాల్పులు జరపడం దారుణమన్నారు.
రిజర్వేషన్లు ప్రకటించిన రెండో రోజే, కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చి నామినేషన్లు ప్రారంభించడం పూర్తిగా కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ఎస్ఈసీ చంద్రబాబుకు ఎక్స్టెన్షన్ గవర్నమెంట్లా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇసుక నుంచి మద్యం వరకు అన్నింట్లోనూ మాఫియా నడుస్తోందని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నిబంధనలకు విరుద్ధంగా కొందరి అధికారులను ఏళ్ల తరబడి కొనసాగిస్తూ సిండికేట్గా మార్చారని ధ్వజమెత్తారు.
నిమ్మగడ్డ రమేష్ కుంఫనీ ఎస్ఈసీగా టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, నాటి తమ హయాంలో అధికారులు బదిలీల తర్వాత కూడా ఎలాంటి హింసకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా స్థానిక ఎన్నికలు నిర్వహించామని, తాము 99 మున్సిపాలిటీల్లో 97 కైవసం చేసుకుని 86 శాతం విజయాలు సాధించామని గుర్తుచేశారు. నాడు తాము నమ్మిన ప్రజాసంక్షేమమే గెలిపించిందని, నేడు చంద్రబాబు మాత్రం కేవలం భయంతో, అణచివేతతో గెలవాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు.








