ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు..

ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు..

Summarize with AI

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలకు హైదరాబాద్‌లోని చారిత్రక ట్యాంక్‌బండ్‌ ముస్తాబైంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్టోబర్ 18, ఆదివారం సాయంత్రం గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సంబరాల్లో టాలీవుడ్‌ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొననుండటం ప్రధాన ఆకర్షణగా మారింది.

సంప్రదాయ పూల పండుగకు సినీ తారల సందడి తోడవడంతో అభిమానుల్లోనూ, నగరవాసుల్లోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరవీరుల స్మారక స్థూపం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు సుమారు వెయ్యి బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, మహిళల సంప్రదాయ పాటలు, ఆటపాటలతో హుస్సేన్‌సాగర్‌ తీరం పండుగ శోభను సంతరించుకోనుంది.

ఈసారి వేడుకల్లో తెలంగాణ జానపద కళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 700 మంది కళాకారులు పేరిని నృత్యం, గుస్సాడీ, ఒగ్గు డోలు, డప్పు వంటి సంప్రదాయ కళారూపాలతో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు ప్రత్యేక లేజర్‌ షో నిర్వహించడంతో పాటు బాణసంచా ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో వేదిక వద్ద అలంకరణలు, ఎల్‌ఈడీ తెరలు, లైటింగ్‌, భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.

పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులతో సమీక్షించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పూల పండుగ వైభవం, జానపద కళల సందడి, లేజర్‌ వెలుగులు, సినీ తారల రాకతో ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment