సౌకర్యాలు అడిగితే టీసీలిచ్చేస్తారా..? దీన‌స్థితికి ఏపీ విద్యా వ్య‌వ‌స్థ‌

సౌకర్యాలు అడిగితే టీసీలిచ్చేస్తారా..? దీన‌స్థితికి ఏపీ విద్యా వ్య‌వ‌స్థ‌

Summarize with AI

వైఎస్‌ జగన్‌ హయాంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వగా, ప్రస్తుత కూటమి పాలనలో కనీస సౌకర్యాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను నిలదీయాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యలను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులే ప్రశ్నించిన తల్లిదండ్రుల పిల్లలకు టీసీలు ఇచ్చేయాలంటూ వ్యాఖ్యానించడం రాష్ట్ర విద్యా వ్యవస్థ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం శివన్నపేట గిరిజన బాలికల గురుకుల పాఠశాల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఈ సమావేశంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను తల్లిదండ్రులు ఏకరవు పెట్టారు. పాఠశాలలో ఫ్యాన్లు లేకపోవడం, రక్షిత తాగునీరు అందుబాటులో లేకపోవడం, సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం, నిర్దేశిత మెనూ అమలు కాకపోవడం వంటి సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో ఫ్యాన్లు లేకపోతే తల్లిదండ్రులే ఏర్పాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

విద్యార్థినుల సమస్యలను పరిష్కరిస్తారని ఆశతో సమావేశానికి హాజరైన తల్లిదండ్రులకు కలెక్టర్‌ వ్యాఖ్యలు తీవ్ర నిరాశ కలిగించాయి. ప్రతిపక్ష నాయకులతో కలిసి రాజకీయం చేస్తున్నారా? అంటూ కలెక్టర్‌ ప్రశ్నించారని, సమస్యలను ప్రస్తావించిన తల్లిదండ్రుల పిల్లలకు టీసీలు ఇచ్చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారని తల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కలెక్టర్‌ వ్యాఖ్యలపై ఓ విద్యార్థిని తల్లి స్పందిస్తూ.. కనీస సౌకర్యాలు కల్పించలేనప్పుడు టీసీలు ఇచ్చేయాలని, తమ పిల్లలను మరో పాఠశాలలో చేర్పించుకుంటామని బదులిచ్చారు. సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటే తమపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల అనారోగ్యానికి గల కారణాలను గుర్తించి, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు సమస్యలను ప్రస్తావించిన వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఐటీడీఏ పీఓ వైశాలి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి పేరెంట్స్‌ కమిటీ బాధ్యులను ఆహ్వానించలేదు. అనారోగ్యానికి గురైన విద్యార్థినుల తల్లిదండ్రులను మాత్రమే సమావేశానికి పిలిచారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై కొంతకాలంగా పేరెంట్స్‌ కమిటీ నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వారిని సమావేశానికి ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది.

గతంలో విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై పేరెంట్స్‌ కమిటీ నాయకుడొకరు మాట్లాడిన వీడియోను సమావేశంలో అధికారులు ప్రదర్శించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు సమావేశం నిర్వహించినప్పటికీ తల్లిదండ్రులకు భోజనం కూడా ఏర్పాటు చేయకపోవడంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సదుపాయాలను పరిరక్షించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.

కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం కూడా రాజకీయమవుతుందా? సమస్యలను పరిష్కరించడానికి బదులుగా విద్యార్థులకు టీసీలు ఇచ్చేయాలనడం ఏ విధంగా సమంజసం? కురుపాం గురుకుల పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment