28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సునామీ

28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సునామీ

Summarize with AI

భారత యువ క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2026) వన్డే టోర్నీలో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని, 50 ఓవర్ల (లిస్ట్-ఎ) క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

దోహాలోని యూనివర్సిటీ ఆఫ్ దోహా క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం 250 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్నిచ్చాడు.

క్రీజులోకి వచ్చినప్పటి నుంచే యూఏఈ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వైభవ్, కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన ఈ యువ చిచ్చరపిడుగు, తదుపరి 12 బంతుల్లోనే మరో 50 పరుగులు జోడించి 28 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం వైభవ్ 40 బంతుల్లో 20 సిక్సర్లు, 6 ఫోర్లతో 151 పరుగులతో అజేయంగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు

బద్దలైన ప్రపంచ రికార్డులు
ఈ సుడిగాలి ఇన్నింగ్స్‌తో వైభవ్ పలు కీలక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2023లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున టాస్మానియాపై ఆసీస్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 29 బంతుల్లో సెంచరీ సాధించి నెలకొల్పిన ప్రపంచ రికార్డును వైభవ్ (28 బంతులు) అధిగమించాడు.

భారత్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఇంతకుముందు బిహార్ ఆటగాడు సకిబుల్ గని (32 బంతులు, విజయ్ హజారే ట్రోఫీ) పేరిట ఉండగా, తన సొంత రాష్ట్ర ఆటగాడి రికార్డును వైభవ్ చెరిపేశాడు.

ఈ టోర్నీలో గత రెండు మ్యాచ్‌లలో (నేపాల్, పాకిస్థాన్ ‘ఎ’ జట్లపై) పెద్దగా రాణించలేకపోయిన వైభవ్, యూఏఈపై తన విశ్వరూపం ప్రదర్శించి విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. వైభవ్ విధ్వంసంతో భారత్ ‘ఎ’ జట్టు విజయం దిశగా దూసుకుపోతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment