అమ్మవారి నిధి.. అన్న క్యాంటీన్ ఖాతాలోకి?.. నిధులు దారి మ‌ళ్లింపు!

అమ్మవారి నిధి.. అన్న క్యాంటీన్ ఖాతాలోకి?.. నిధులు దారి మ‌ళ్లింపు!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రసన్న గంగమ్మ జాతర నిధుల మళ్లింపు అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుప్పం ప్రజల ఆరాధ్య దైవం ప్రసన్న గంగమ్మ తల్లి జాతర అంటే ఆ ప్రాంతంలో ఎంతో పవిత్రమైనది. భక్తులు తమ మొక్కుల రూపంలో భారీగా విరాళాలు సమర్పిస్తుంటారు. అయితే, ఈసారి జాతరలో వస్తున్న అన్నదాన విరాళాలను సాక్షాత్తూ అధికార పార్టీ నేతలే పక్కదారి పట్టిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.

గంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులు అన్నదాన పథకం కోసం ఇచ్చే విరాళాలను ఆలయ సంక్షేమ నిధికి జమ చేయాల్సి ఉండగా, వాటిని ‘కుప్పం మన అన్న క్యాంటీన్’ ట్రస్ట్ ఖాతాకు తరలించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆలయ చైర్మన్ రవి చంద్రబాబు నేతృత్వంలో ఈ నిధుల మళ్లింపు జరుగుతోందని, భక్తుల నుంచి సేకరించిన సొమ్మును సొంతంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. జాతర పేరుతో వ్యాపారులు, సామాన్య ప్రజల నుంచి టీడీపీ నేతలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంపద సృష్టి అంటే.. దేవుడి సొమ్ము దోచుకోవడమేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే “సంపద సృష్టి” అంటే ఇదేనా అని ప్రతిపక్షాలు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే దేవాలయ నిధులు దారి మళ్లుతుంటే, ఇక రాష్ట్రంలో మిగిలిన ఆలయాల పరిస్థితి ఏంటని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దేవాలయ నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం అన్న క్యాంటీన్లకు మళ్లించడాన్ని వెంటనే ఆపాలి. నిధుల గోల్‌మాల్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

భక్తితో సమర్పించిన విరాళాలను రాజకీయ పంతాల కోసం, ప్రచారాల కోసం వాడటం అపచారమని భక్తులు భావిస్తున్నారు. ఈ వివాదం పై ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment