తెలంగాణ (Telangana) రాష్ట్రం పుష్కరకాలం తర్వాత ముష్కరుల చేతిలోకి పోయిందని బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వైఖరిపై, కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) వైఫల్యాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నేను రేవంత్ రెడ్డిపై కోపంతో మాట్లాడటం లేదు, తీవ్రమైన బాధతో మాట్లాడుతున్నాను. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. వందల, వేల మంది త్యాగాల పునాదులపై నిర్మించుకున్న తెలంగాణ నేడు అస్తవ్యస్తంగా మారుతుంటే గుండె తరుక్కుపోతోంది. రాష్ట్రంలో ప్రజలు ఏ చిన్న బాధపడ్డా, ఏ సమస్య వచ్చినా నిజంగా కలత చెందే ఏకైక నాయకుడు కేసీఆర్(KCR) మాత్రమే. కేసీఆర్‌కు పదవులు కొత్త కాదు, ఆయనకు పదవి అనేది ఒక పెద్ద లెక్కే కాదు.. ప్రజల బాగు మాత్రమే ఆయనకు ముఖ్యం” అని స్పష్టం చేశారు.
సిరిసిల్ల నేతన్నల (Sircilla Weavers) సంక్షేమం (Welfare) కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలను కాంగ్రెస్ (Congress) రద్దు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. “బతుకమ్మ చీరల (Bathukamma Sarees) వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ రేవంత్ రెడ్డికి అస్సలు అర్థం కాలేదు. బతుకమ్మ చీరల పథకం కేవలం పంపిణీ కోసం తెచ్చింది కాదు.. ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల నేతన్నలకు నిరంతరం పని కల్పించడం కోసం కేసీఆర్ తెచ్చిన పథకం అది. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి నేను స్వయంగా పలుమార్లు చెప్పినా.. తన మూర్ఖత్వంతో నా మాటలను పెడచెవిన పెట్టారు” అని కేటీఆర్ మండిపడ్డారు.
వ్యవసాయ రంగంలో(Agriculture Sector) కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని కేటీఆర్ విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల (Farmers) పంట కళ్లాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేసిందని, కానీ నేడు రైతులు కాళ్లు పట్టుకున్నా కొనుగోలు చేయని దౌర్భాగ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రాన బీఆర్‌ఎస్ బలహీనపడలేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి ఉన్నంత కేడర్ బలం, బలగం మరే ఇతర రాజకీయ పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేస్తామని, నేతన్నలు, రైతుల పక్షాన బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు.








