ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు గర్జన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ‘‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు’’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధు, యాసంగి పెట్టుబడి సాయం కలిపి ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామన్న హామీ, రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు భరోసా ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
సాగునీటి అంశాన్ని ప్రస్తావిస్తూ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సక్రమంగా వినియోగించుకుంటే ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు కిందికి ప్రవహిస్తున్నా ఎత్తిపోయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. గోదావరిలో 750 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించలేకపోవడానికి బాధ్యులెవరని నిలదీశారు. రైతులు పంటలు వేయవద్దని చెప్పే పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చారని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ఢిల్లీకి నిధులు పంపేందుకు మాత్రం వెనుకాడటం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, కరువు బాధ్యత నుంచి తప్పించుకోవద్దని డిమాండ్ చేశారు.
అనంతరం తన ప్రసంగానికి కొనసాగింపుగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. అన్నదాతల సంఘటిత శక్తితో మళ్లీ రైతు బాంధవుడు కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం అని తెలిపారు.








