కడపలో ఓటర్ స్లిప్పులు చెత్తలో.. 361 కేంద్రాల్లో రీపోలింగ్‌కు వైసీపీ డిమాండ్!

కడపలో ఓటర్ స్లిప్పులు చెత్తలో.. 361 కేంద్రాల్లో రీపోలింగ్‌కు వైసీపీ డిమాండ్!

Summarize with AI

కడప ఐటీఐ సర్కిల్ సమీపంలోని చెంబుమియాపేట జడ్పీ హైస్కూల్ వద్ద ఓటర్లకు పంపిణీ చేయాల్సిన స్లిప్పులు చెత్తకుప్పలో కనిపించడం కలకలం రేపింది. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లకు చేరాల్సిన స్లిప్పులు చెత్తలోకి ఎలా చేరాయో ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

చైర్‌పర్సన్ అభ్యర్థికి అడ్డంకులు

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో చైర్‌పర్సన్ అభ్యర్థి హైమావతిని అడ్డుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు కడప నగరంలోని బుడ్డయ్యపల్లె ఏడో డివిజన్‌లో ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై దాడులు జరిగాయి. ఎల్లారెడ్డి కుమారుడిని కూడా టీడీపీ నాయకులు కొట్టి బెదిరించినట్లు సమాచారం. నబికోట ఉర్దూ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వెయ్యడానకి క్యూలో ఉన్న ఓటర్లను సైతం కూటమి చెందిన నాయకులు తరిమివేశారు.

361 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలి

కడప కార్పొరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఆరోపిస్తూ వైసీపీ నేతల బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసింది. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను కేంద్రాల్లోకి అనుమతించకుండానే ఎన్నికలు నిర్వహించారని ఫిర్యాదు చేసింది. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, మేయర్ అభ్యర్థి బండి దీప్తి తదితరులు 361 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పోలింగ్ శాతాలపై అనుమానాలు

జమ్మలమడుగులో ఉదయం 11 గంటలకే 60.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎస్‌ఈసీ ప్రకటించగా, మధ్యాహ్నం ఒంటి గంటకు 61.86 శాతంగా వెల్లడైంది. ఈ గణాంకాలపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. పులివెందులలోనూ వైసీపీ ఏజెంట్లను అడ్డుకుని, స్థానిక ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా దొంగ ఓట్లు వేస్తున్నారని తెలిపారు. ఈ పరిణామాలపై ఈసీ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

బ్యాలెట్ పత్రాలపై వృద్ధురాలి ఆవేదన

పులివెందుల 27వ వార్డులో టీడీపీ ఏజెంట్ బ్యాలెట్ పత్రాలను లాక్కొని తన ఓటు వేశారంటూ ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను బయటకు పంపడం, దొంగ ఓట్లను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ డీఎస్పీ వెంకటేశ్వరరావును నిలదీశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment