కొరియన్ కనకరాజు రివ్యూ.. నిలబెట్టిన సత్య!

కొరియన్ కనకరాజు రివ్యూ..

Summarize with AI

సినిమా : కొరియ‌న్ క‌న‌క‌రాజు
నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయక్, కమేడియన్ సత్య, సునీల్, టెంపర్ వంశీ, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
సంగీతం: థమన్ ఎస్.ఎస్.
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
నిర్మాణ సంస్థలు: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
రేటింగ్: 2.5 / 5

వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) అనే అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషన్లతో మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం నేడు (ఆగస్ట్ 7) థియేటర్లలోకి వచ్చింది. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) మార్క్ కామెడీతో వచ్చిన ఈ చిత్రం వరుణ్‌ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిందో లేదో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే?
అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) తన స్నేహితుడు కిష్టప్ప (సత్య) నడిపే ఫోటో స్టూడియోలో చెక్కభజన బృందాన్ని నిర్వహిస్తుంటాడు. ఊర్లోనే ఉండే చెంగా రెడ్డి (సునీల్) మనుషులతో కనకరాజుకు నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఇదే ఊర్లోని కియా ఫ్యాక్టరీలో పని చేస్తూ, ఎలాగైనా కొరియా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలుకనే చైత్ర (రితికా నాయక్)తో కనకరాజు ప్రేమలో పడతాడు.

ఇదిలా ఉండగా, కొరియాలో చనిపోయిన ఒక గ్యాంగ్‌స్టర్ అస్తికలు అనూహ్య పరిస్థితుల్లో పెనుగొండకు వస్తాయి. అనుకోకుండా ఆ అస్తికల ద్వారా కనకరాజు ఒంట్లోకి ఒక కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. దాంతో పల్లెటూరి కుర్రాడైన కనకరాజు ఒక్కసారిగా కొరియన్ భాషలో మాట్లాడటం మొదలుపెడతాడు. కొరియన్ లాంగ్వేజ్ తెలిసిన చైత్ర ఆ ఆత్మ చివరి కోరికను అర్థం చేసుకుంటుంది. ఆ ఆత్మ కోరిక తీర్చడానికి కనకరాజు, చైత్ర, కిష్టప్ప కొరియా వెళ్లాల్సి వస్తుంది. అసలు ఆ కొరియన్ ఆత్మ కథేంటి? కనకరాజుకి ఆ ఆత్మ నుంచి విముక్తి లభించిందా లేదా? అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే?
దర్శకుడు మేర్లపాక గాంధీ ఎంచుకున్న లైన్ పాతదే అయినప్పటికీ.. ‘కొరియన్ ఆత్మ’ అనే ఎలిమెంట్‌ను సీమ బ్యాక్‌డ్రాప్‌కి ముడిపెట్టడం కొంతవరకూ కొత్తగా అనిపిస్తుంది. అయితే కథనం మాత్రం చాలా చోట్ల ఊహకందేలా, రొటీన్‌గా సాగడం ప్రధాన మైనస్.

ఫస్టాఫ్
హీరో ఎంట్రీ, మాస్ సాంగ్, లవ్ ట్రాక్, ఫైట్లతో కథ కాస్త నిమ్మళంగానే ప్రారంభమవుతుంది. అయితే ఎప్పుడైతే వరుణ్ తేజ్ ఒంట్లోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుందో, అక్కడి నుంచి కొంత‌ పుంజుకుంటుంది. వరుణ్-సత్య కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్లు, కొరియన్ లాంగ్వేజ్ సెటైర్లు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కథపై ఆసక్తిని పెంచుతుంది.

సెకండాఫ్
ద్వితీయార్ధంలో కథ కొరియా బ్యాక్‌డ్రాప్, మాఫియా ఎపిసోడ్స్ వైపు వెళ్తుంది. కొరియన్ డాన్ ఫ్లాష్‌బ్యాక్ పర్వాలేదనిపిస్తుంది. ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేక వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఊర్లోని మురళీధర్ గౌడ్‌తో సత్య చేసే క్షుద్రపూజల ఎపిసోడ్ సినిమాకే ప్రధాన హైలైట్.

బలహీనతలు
కథలో ఏమాత్రం లాజిక్స్‌ వెతకకూడదు. క్లైమాక్స్ మాత్రం చాలా ఘోరంగా, కార్టూనిష్‌గా అనిపిస్తుంది. అక్కడ వాడిన ఏఐ (AI) షాట్లు, ఆత్మల పోరాటాలు సిల్లీగా మారి ట్రోలింగ్ మెటీరియల్‌గా తయారయ్యే ప్రమాదం ఉంది.

  • ఎవరెలా చేశారంటే?
  • వరుణ్ తేజ్ రాయలసీమ మాస్ కుర్రాడిగా, అలాగే కొరియన్ గ్యాంగ్‌స్టర్‌గా రెండు భిన్నమైన షేడ్స్‌లో వరుణ్ తన పాత్ర‌లోని వేరియేషన్ చూపించాడు. యాక్షన్‌తో పాటు తన కామెడీ టైమింగ్‌తో బాగానే మెప్పించాడు.
  • కమేడియన్ సత్య ఈ సినిమాకి అసలైన పిల్లర్ సత్య అనే చెప్పాలి. తనదైన వన్ లైనర్లు, మీమ్ మెటీరియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. బలహీనమైన సీన్లను కూడా తన కామెడీతో నిలబెట్టాడు.
  • రితికా తెరపై అందంగా కనిపించడమే కాకుండా తన పరిధి మేర బాగా నటించింది. సునీల్, మురళీధర్ గౌడ్, టెంపర్ వంశీ, వీటీవీ గణేష్ తమ పాత్రల్లో నవ్వించారు.

థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కామెడీ, యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.

ఏ మాత్రం లాజిక్స్ వెతక్కుండా, క్లైమాక్స్ లోపాలను పక్కన పెడితే.. ఈ వీకెండ్‌లో కేవలం సత్య కామెడీ, కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి చూడదగ్గ ‘టైమ్ పాస్ హారర్ ఫన్ రైడ్’ ఈ ‘కొరియన్ కనకరాజు’

Join WhatsApp

Join Now

Leave a Comment