కొండా సురేఖ బర్తరఫ్‌పై స్పందించిన బీఆర్ఎస్‌

కొండా సురేఖ బర్తరఫ్‌పై స్పందించిన బీఆర్ఎస్‌

Summarize with AI

మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. బీసీ మ‌హిళా మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంపై కొండా వ‌ర్గం తీవ్రంగా మండిప‌డుతోంది. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ నేత‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రజలకు సంబంధించిన అంశాలని పేర్కొంటూ.. వారు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డిపై ఆరోపణలు చేశారని, అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొండా సురేఖ ప్రశ్నిస్తున్నారని అన్నారు. సురేఖ అంశాన్ని కేవలం పార్టీ అంతర్గత వ్యవహారంగా చూడకుండా.. ఆమె లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు ఏమైనా కవిత పార్టీలో జాయిన్ అవుతారా? లేక కవిత పార్టీని విలీనం చేసుకుంటారా?’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహించాల్సి వచ్చిందని, అయితే ఇతర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలో కొండా సురేఖ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి బంగారు రాఖీ కట్టిన విషయాన్ని కూడా దాసోజు శ్రవణ్ ప్రస్తావించారు.

‘‘రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గర సీఎం పదవి కొనుక్కున్నారా? ఏఐసీసీ నుంచి రేవంత్ రెడ్డి ఫ్రాంఛైజీ తెచ్చుకున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘పదేళ్లు నేనే సీఎం’’ అని రేవంత్ రెడ్డి చెబుతున్నప్పటికీ.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్‌లో ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం ఎందుకని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించడాన్ని కూడా దాసోజు శ్రవణ్ ప్రస్తావించారు. చిన్నారెడ్డి కరుడుగట్టిన తెలంగాణవాది, కాంగ్రెస్‌వాది అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ‘‘తెలంగాణ ద్రోహి, బీసీ ద్రోహి’’గా అభివర్ణించారు.

సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీ చేయాలా? వద్దా? అనే విషయాన్ని ఏఐసీసీ నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అలాంటప్పుడు పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని అభ్యర్థిగా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. పార్టీ టికెట్ల విషయంలో ఏఐసీసీదే తుది నిర్ణయం అయితే.. పరకాల విషయంలో సీఎం ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీశారు.

కొండా సురేఖ బర్తరఫ్‌ వ్యవహారం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment