నెగ్గిన రేవంత్ పంతం.. మంత్రి కొండా సురేఖపై వేటు

నెగ్గిన రేవంత్ పంతం.. మంత్రి కొండా సురేఖపై వేటు

Summarize with AI

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేస్తూ రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచించినప్పటికీ ఆమె అందుకు అంగీకరించకపోవడంతో బర్తరఫ్ చేస్తూ ఒక నోట్ విడుద‌ల చేసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి రాష్ట్ర సీఎంవోకు ఆదేశాలు వచ్చాయి. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే నిర్ణయాన్ని సీఎంవో లోక్‌భవన్‌కు తెలియజేసినట్లు సమాచారం.

ఇటీవ‌ల ప‌ర‌కాలలో కొండా సురేఖ పుట్టిన‌రోజు సందర్భంగా కొండా సుష్మిత సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. సీఎం అయ్యాక‌ రేవంత్‌కు కళ్లు నెత్తికెక్కాయా..? అంటూ, రాష్ట్రంలో అచ్చా కాంగ్రెస్ కాదు.. ప‌చ్చ కాంగ్రెస్ రాజ్య‌మేలుతోంద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాకుండా ప‌ర‌కాల ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా రేవూరి ప్రకాశ్ రెడ్డిని రేవంత్ ఎలా ప్రకటిస్తారు? అని ప్ర‌శ్నించారు. కొండా సుష్మిత వ్యాఖ్య‌లు కాంగ్రెస్‌లో అగ్గిరాజేశాయి. కాంగ్రెస్‌లోని రేవంత్ వ‌ర్గ‌మంతా మీడియా ముందుకు వ‌చ్చి కొండా సుష్మిత వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు.

త‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించిన కొండా కుటుంబంపై రేవంత్‌రెడ్డి పంతం నెగ్గించుకున్నార‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇలాంటి నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందా..? కొండా సురేఖను కొనసాగించాలని అధిష్టానం చెప్పినా.. రేవంత్ దాన్ని అంగీకరించే అవకాశం ఉందనుకోవడం అవివేకం అంటున్నారు సొంత పార్టీ నేతలు.

సీనియర్ కాంగ్రెస్ నేత కొండా సురేఖ‌ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పిస్తూ, మరోవైపు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌గా ఉన్న మరో సీనియ‌ర్ లీడ‌ర్ చిన్నారెడ్డిని కూడా పదవి నుంచి ప్రభుత్వం తొలగించడం సంచ‌ల‌నంగా మారింది. చిన్నారెడ్డి స్థానంలో కేకే కుమార్తె, మాజీ మేయ‌ర్‌ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ రేవంత్ స‌ర్కార్ నిర్ణయం వెల్ల‌డించింది.

ఒకేసారి మంత్రి పదవితో పాటు పలు కీలక నామినేటెడ్‌ పదవుల్లో మార్పులు చోటుచేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖపై తీసుకున్న చర్య నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో తాజా పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment