చర్మాన్ని(Skin) అందంగా(Beautiful), తాజాగా ఉంచుకోవడానికి చాలామంది వివిధ రకాల స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌ను(Skin Care Products) ఉపయోగిస్తుంటారు. వాటిలో రోజ్ వాటర్(Rose Water) కూడా ప్రముఖమైనది. ఇది చర్మానికి తేమను అందించడంతో పాటు చల్లదనాన్ని, ఫ్రెష్‌నెస్‌ను కలిగించడంలో సహాయపడుతుందని భావిస్తారు. ముఖ్యంగా వేసవిలో ఎండ కారణంగా చర్మంపై కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు చాలామంది రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తారు.
మార్కెట్‌లో రోజ్ వాటర్ సులభంగా లభించినప్పటికీ.. కొద్దిపాటి శ్రమతో ఇంట్లోనే తాజా గులాబీ రేకులతో తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం 3 కప్పుల తాజా గులాబీ రేకులు, 3 కప్పుల శుభ్రమైన నీరు అవసరం. ముందుగా రేకులను బాగా కడిగి ఒక పాత్రలో వేయాలి. రేకులు పూర్తిగా మునిగేంత నీటిని పోసి, మీడియం మంటపై మెల్లగా వేడి చేయాలి. నీటిని బాగా మరిగించకుండా జాగ్రత్త వహించాలి.
రేకుల రంగు, సువాసన నీటిలోకి చేరి.. అవి రంగును పూర్తిగా కోల్పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నీటిని వడకట్టి పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన గాజు సీసా లేదా స్ప్రే బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో ఉంచాలి. మరో పద్ధతిలో రేకులతో ఉన్న పాత్రకు తలకిందులుగా మూత పెట్టి, దానిపై ఐస్ ముక్కలు ఉంచాలి. ఆవిరి చల్లటి మూతను తాకి నీటి బిందువులుగా మారుతుంది. ఇలా సేకరించిన నీటిని వడకట్టి రోజ్ వాటర్‌గా ఉపయోగించుకోవచ్చు.
ఇంట్లో తయారు చేసుకున్న రోజ్ వాటర్ను ఫేస్ టోనర్, ఫేస్ మిస్ట్ లేదా ఫేస్ ప్యాక్‌లో ఉపయోగించవచ్చు. అయితే స్కిన్‌కేర్ కోసం పురుగుమందులు, ఇతర రసాయనాలు ఉపయోగించని శుభ్రమైన గులాబీ రేకులను మాత్రమే ఎంచుకోవడం మంచిది. తయారు చేసిన రోజ్ వాటర్‌ను శుభ్రమైన సీసాలో ఫ్రిజ్‌లో భద్రపరచాలి. వాసన, రంగు లేదా రూపంలో మార్పులు కనిపిస్తే దానిని ఉపయోగించకపోవడం మంచిది.








