రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: కేటీఆర్

రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. “నిజం నిలకడ మీద తెలుస్తుంది” అన్న నానుడి నేడు నిజమైందని పేర్కొంటూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కాళేశ్వరం కుంగిపోయిందంటూ రాష్ట్రం అంతా తిరిగిన రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని బ్యారేజీ వద్దకు తీసుకెళ్లి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తాను మొదటి నుంచే ‘పీసీసీ రిపోర్ట్’ అని పిలుస్తున్నానని, తాజా పరిణామాలతో అది నిజమైందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను కేటీఆర్ ఖండిస్తూ, మొత్తం ప్రాజెక్టు ఖర్చు 94 వేల కోట్లు మాత్రమే అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంలో కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరించిన బీజేపీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్డీఎస్ఏ స్పందించిన వేగం, ఇతర ప్రాజెక్టుల విషయంలో ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పెరిగిన పంట దిగుబడులే కాళేశ్వరం విజయానికి నిదర్శనమని గుర్తుచేస్తూ, రాజకీయ కక్షలు పక్కన పెట్టి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment