కడపలో (Kadapa) రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారి పెద్ద దస్తగిరి (Pedda Dastagiri) హత్య కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అధికార టీడీపీ(TDP) ఈ హత్యను వైసీపీ(YSRCP) నేతలకు అంటగడుతూ విమర్శలు చేస్తున్న తరుణంలో, మృతుడి భార్య రమణమ్మ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమె వ్యాఖ్యలు టీడీపీకి(TDP) షాక్ ఇచ్చేలా ఉండటమే కాకుండా, కేసులో కొత్త కోణాన్ని బయటపెట్టాయి.
కడప రిమ్స్ వద్ద జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేసులో బాధితుడి కుటుంబం మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు వెల్లడించింది. ఈ హత్య వెనుక వైసీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి (Nityananda Reddy) హస్తం ఉందని పోలీసులు, టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. మృతుడి భార్య రమణమ్మ (Ramanamma) మాత్రం వాటిని పూర్తిగా కొట్టిపారేశారు.
రమణమ్మ స్టేట్‌మెంట్‌లో కీలక అంశాలు
తన భర్తకు నిత్యానందరెడ్డితో ఎటువంటి విభేదాలు లేవని రమణమ్మ స్పష్టం చేశారు. “30 ఏళ్లుగా నా భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఆయనది. పత్రికల్లో రాస్తున్నట్లు రూ. 100 కోట్ల ఆస్తుల డాక్యుమెంట్ల గొడవ అనేది పూర్తిగా అవాస్తవం” అని చెప్పారు.
హత్యకు గల అసలు కారణాన్ని వివరిస్తూ.. ఇటీవల జరిగిన ఒక జాతరలో డీజే డ్యాన్స్ విషయంలో చిన్న గొడవ జరిగిందని చెప్పారు. ఆ సమయంలో పిల్లలను తామే మందలించి పంపించామని, కానీ వారే కక్ష పెంచుకుని ప్రతిదాడులకు దిగి తన భర్తను హత్య వరకు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. “మా ఇంట్లోకి వచ్చి పోలీసులు డాక్యుమెంట్లు అన్నీ తీసుకెళ్లారు. ఆ డాక్యుమెంట్లపైనే మేము బతకాల్సి ఉంది. మా పత్రాలు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలి” అని ఆమె డిమాండ్ చేశారు.
తృటిలో తప్పించుకున్న చిన్న దస్తగిరి
మృతుడి సోదరుడు చిన్న దస్తగిరి కూడా మీడియా వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. “మా అన్నను చంపి, నన్ను కూడా చంపాలని చూశారు. నాపై కత్తితో దాడి చేశారు, అదృష్టవశాత్తూ నేను బతికాను. ఒక చిన్న వివాదానికి ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. నిత్యానందరెడ్డితో మాకు ఎలాంటి గొడవలు లేవు, హత్య వెనుక అసలు కారణాలను పోలీసులే నిష్పక్షపాతంగా తేల్చాలి” అని కోరారు.
రాజకీయ రంగు పులుముకున్న హత్య
ప్రస్తుతం ఈ కేసు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నేతలు ఈ హత్యను వైసీపీ నాయకుల ఖాతాలో వేయాలని చూస్తుంటే, బాధితుడి కుటుంబం చేసిన ప్రకటనతో పరిస్థితి తలకిందులైంది. పాత కక్షలు, స్థానిక గొడవలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు చెబుతుండగా, పోలీసులు మాత్రం ఆస్తి పత్రాలు, నిత్యానందరెడ్డి చుట్టూనే విచారణ జరుపుతుండటం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు మృతుడి కుటుంబ సభ్యులు.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్