జెత్వానీ కేసులో నిజాలు దాచిపెట్టి.. ఐపీఎస్‌లపై కక్షసాధింపులా..?

జెత్వానీ కేసులో నిజాలు దాచిపెట్టి.. ఐపీఎస్‌లపై కక్షసాధింపులా..?

Summarize with AI

కాదంబరి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) వాస్తవాలను పూర్తిగా పక్కనపెట్టి, ముగ్గురు సీనియర్‌ పోలీసు అధికారులపై కూటమి ప్రభుత్వం (Alliance Government) తీసుకున్న చర్యలను సమర్థించేందుకు టీడీపీ(TDP) అనుకూల మీడియా (ఎల్లో మీడియా) మరోసారి రంగంలోకి దిగింది. దర్యాప్తు సందర్భంగా అనుసరించిన న్యాయపరమైన ప్రక్రియను, వివిధ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను, చివరకు హైకోర్టు (High Court) చేసిన కీలక పరిశీలనలను దాచిపెట్టి కథనాలు రాయడం ద్వారా ప్రజలను తప్పుదోవ‌ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

కాదంబరి జెత్వానీ బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ సీఐడీ(CID) నిర్ధారించి దీనికి సంబంధించిన ఛార్జిసీటు కోర్టులో(Court) ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో, అది నిజమే కాని, సస్పైండైన పోలీసులు(Police) కూడా తప్పులు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను సమర్థించే ప్రయత్నాలు చేస్తోందన్న చ‌ర్చ ఊపందుకుంది.

కుక్కల విద్యాసాగర్‌ (Kukkala Vidyasagar) ఇచ్చిన ఫిర్యాదులో కాగ్నిజబుల్‌ (Cognizable) నేరానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని గుర్తించిన ఇబ్రహీంపట్నం పోలీసులు (Ibrahimpatnam Police) 2024 ఫిబ్రవరి 2న ఉదయం 6.30 గంటలకు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన ఫొటో, బ్యాంకు లావాదేవీల వివరాలు సహా కొన్ని ఆధారాలను సేకరించారు. అదేరోజు రాత్రి విజయవాడ నాలుగో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి సెర్చ్‌ వారెంట్‌, పోలీసు కమిషనర్‌ నుంచి అంతర్‌రాష్ట్ర అనుమతులు తీసుకున్నారు. అంటే కేసు నమోదు నుంచి ముంబై వెళ్లేవరకు ప్రతిదీ అధికారికంగా, కోర్టు అనుమతులతోనే జరిగింది.

మరుసటి రోజు దర్యాప్తు అధికారి తన సిబ్బందితో ముంబై వెళ్లి నేరుగా జుహూ పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించారు. అక్కడి పోలీసుల సహాయాన్ని లిఖితపూర్వకంగా కోరారు. జుహూ పోలీసు సిబ్బంది, స్థానిక మధ్యవర్తుల సమక్షంలోనే జెత్వానీ, ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు కారణాలను వివరించి జుహూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని ముంబై మెట్రోపాలిటన్‌ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌ పొందిన తర్వాతే విజయవాడకు తీసుకొచ్చారు.

విజయవాడకు (Vijayawada) తీసుకొచ్చిన తర్వాత కూడా నిబంధనల ప్రకారమే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాలుగో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ (Metropolitan Magistrate) ముందు హాజరుపరచగా, న్యాయస్థానం 13 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారమే జిల్లా జైలుకు తరలించారు. తర్వాత ఐదు రోజుల పోలీసు కస్టడీకి కూడా కోర్టే అనుమతి ఇచ్చింది. ఆ విచారణ ఇద్దరు వీఆర్వోలు (VROs), నిందితుల తరఫు న్యాయవాది సమక్షంలోనే జరిగింది.

మార్చి 12న కోర్టు షరతులతో కూడిన బెయిల్‌(Bail) మంజూరు చేసింది. అనంతరం జిల్లా కోర్టు ద్వారా బెయిల్‌ షరతులను సడలించుకుని వారు ముంబై వెళ్లారు. మే 28న జెత్వానీ నుంచి, జూన్‌ 24న ఫిర్యాదుదారు నుంచి కోర్టు స్వయంగా నమూనా సంతకాలను సేకరించింది. వాటిని ఇతర ఆధారాలతో కలిపి ఫోరెన్సిక్‌ పరీక్ష(Forensic Examination) కోసం ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు (AP FSL) పంపారు. ఇది రాజకీయంగా సృష్టించిన కేసు అయితే ఇంత విస్తృతమైన న్యాయపరమైన ప్రక్రియ, కోర్టుల పర్యవేక్షణ, ఫోరెన్సిక్‌ పరిశీలన ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు ఎల్లోమీడియా సమాధానం చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ కేసులో అత్యంత కీలకమైన అంశాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు. జెత్వానీని ముంబై కోర్టులో హాజరుపరిచినప్పుడు పోలీసులపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. విజయవాడ కోర్టులో హాజరుపరిచినప్పుడు కూడా చేయలేదు. బెయిల్‌ పిటిషన్‌లో, క్వాష్‌ పిటిషన్‌లో, పోలీసు కస్టడీ విచారణలో, బెయిల్‌ షరతుల సడలింపు పిటిషన్‌లోనూ పోలీసుల వేధింపుల ప్రస్తావన లేదు. జైలు(Jail) నుంచి బయటకు వచ్చిన తర్వాత కోర్టుకు వచ్చి నమూనా సంతకాలు ఇచ్చిన సందర్భంలోనూ ఎలాంటి ఆరోపణలు చేయలేదని వైసీపీ చెబుతోంది.

అంతేకాదు, పోలీసు అధికారులపై తర్వాత నమోదు చేసిన క్రైమ్‌ నంబర్‌ 469/2024కు సంబంధించిన నివేదికలో జెత్వానీ స్వయంగా తాను రిమాండ్‌లో ఉన్నప్పుడు, పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు శారీరకంగా వేధించలేదని చెప్పినట్టు రికార్డుల్లో ఉంది. తనను ఎన్టీటీపీఎస్‌ గెస్ట్‌హౌస్‌కుగానీ, మరే ఇతర గెస్ట్‌హౌస్‌కుగానీ తీసుకెళ్లలేదని కూడా స్పష్టంగా పేర్కొన్నట్టు అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి.

అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారిగా కొత్త కథనం తెరపైకి వచ్చింది. గతంలో కోర్టుల ముందు లేని ఆరోపణలు, ఒక్కసారిగా ప్రచారంలోకి తీసుకురావడం మొదలుపెట్టారు. ఆధారాల్లేని ఆ తప్పుడు ప్రచారాల ఆధారంగా ముగ్గురు సీనియర్‌ పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని కేసులు, సస్పెన్షన్లు, అరెస్టుల దిశగా ప్రభుత్వం ముందుకెళ్లిందంటున్నారు న్యాయ నిపుణులు. ఇక్కడే రాజకీయ కక్షసాధింపు స్పష్టమవుతోందని, న్యాయస్థానాల అనుమతులతో జరిగిన దర్యాప్తును పోలీసు అధికారుల వ్యక్తిగత కుట్రగా చూపించి, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను భయపెట్టడమే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా పేర్కొంటున్నారు.

పోలీసు అధికారుల ముందస్తు బెయిల్‌ వ్యవహారంలో హైకోర్టు చేసిన పరిశీలన మరింత కీలకంగా మారింది. క్రైమ్‌ నంబర్‌ 90/2024లో నిందితురాలిగా ఉన్న వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసు అధికారులపై క్రైమ్‌ నంబర్‌ 469/2024 నమోదు చేయడంలో తీవ్రమైన న్యాయపరమైన లోపం ఉన్నట్టు హైకోర్టు పేర్కొన్నదని అందుబాటులో ఉన్న ఉత్తర్వుల సారాంశం చెబుతోంది. పోలీసు అధికారులపై నమోదు చేసిన కేసు దర్యాప్తుపైనా హైకోర్టు స్టే ఇచ్చింది.

హైకోర్టు ఇంత స్పష్టమైన అనుమానాలను వ్యక్తం చేసిన తర్వాత కూడా, ఆ అంశాన్ని ప్రస్తావించకుండా అధికారులను దోషులుగా చిత్రీకరించడం మాత్రం ఎల్లోమీడియా మానలేదంటున్నారు. అది ప్రభుత్వ రాజకీయ అజెండాను అమలు చేయడమేన‌ని, కోర్టు వారెంట్లు, ముంబై పోలీసుల సహకారం, ట్రాన్సిట్‌ రిమాండ్‌, వైద్య పరీక్షలు, జ్యుడీషియల్‌ రిమాండ్‌, కోర్టు అనుమతితో పోలీసు కస్టడీ – ఇన్ని దశలను దాటిన దర్యాప్తును ఇప్పుడు అక్రమ నిర్బంధంగా ప్రచారం చేయడం వాస్తవాలను తలకిందులు చేయడమే అంటోంది వైసీపీ.

ఈ కేసులో విచారణ జరగకూడదని ఎవరూ చెప్పడం లేదు కానీ.. నిజానిజాలు నిష్పాక్షికంగా బయటకు రావాలి.. కానీ, రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాంగ్మూలాలను మార్చడం, గతంలో లేని ఆరోపణలను తర్వాత సృష్టించడం, వాటి ఆధారంగా పోలీసు అధికారులపై కక్షసాధించడం, ఆ చర్యలకు ఎల్లోమీడియా కవచంగా నిలవడం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రమాదకరం అని వైసీపీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.

ముగ్గురు అధికారులను లక్ష్యంగా చేసుకున్న చర్యలు న్యాయబద్ధమైనవా? లేక ప్రభుత్వం మారగానే మొదలైన రాజకీయ ప్రతీకార చర్యలా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఎల్లోమీడియా కథనాలు కాదు – కోర్టు రికార్డులు, కేసు టైంలైన్‌, సాక్ష్యాలు చెప్పాలి. ఆ రికార్డులు బయటకు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వ కథనంలోని డొల్లతనం బయటపడుతూనే ఉంటుందని న్యాయ‌నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment