ఉద్యోగ నియామక పరీక్షల్లో (Recruitment Exams) అవకతవకలు, పేపర్ లీకేజీలను (Paper Leaks) ఆరోపిస్తూ ఝార్ఖండ్‌లో(Jharkhand) యువత(Youth), విద్యార్థులు(Students) చేపట్టిన ఆందోళనలు (Protests) ఉద్రిక్తతకు దారితీశాయి. రాంచీలో జరుగుతున్న ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC-CGL) నిర్వహించిన రిక్రూట్‌మెంట్ పరీక్షలలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని విద్యార్థులు మండిపడుతున్నారు.
జేపీఎస్‌సీ (JPSC) 14వ ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని, ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐ(CBI) లేదా న్యాయ విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని కోరుతూ గత రెండు వారాలుగా ఆందోళన బాటపట్టారు.
నిరసనల్లో భాగంగా సోమవారం రాంచీలో వేలాది మంది ఉద్యోగార్థులు, విద్యార్థులు ఝార్ఖండ్ అసెంబ్లీ (Jharkhand Assembly) ముట్టడికి భారీ ప్రదర్శనగా తరలివచ్చారు. త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ముందుకు కదిలిన ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు వాటర్ క్యానాన్లను (Water Cannons) ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బారికేడ్లను తోసుకుంటూ విద్యార్థులు ముందుకు దూసుకెళ్లడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి, నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.
విద్యార్థుల ఆందోళనలపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) స్పందిస్తూ.. యువతను సొంత బిడ్డలుగా భావిస్తామని, వారి సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హింసాత్మక మార్గాలను ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.
నిరసనకారుల డిమాండ్లలో భాగంగా ఇప్పటికే కొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, సీబీఐ విచారణ మరియు ఇతర డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.








